Janjatiya Gaurav Divas: గిరిజనుల రుణం తీర్చుకుంటా..

16 Nov, 2023 05:35 IST|Sakshi

జార్ఖండ్‌లో ‘జన జాతీయ గౌరవ్‌ దివస్‌’లో ప్రధాని మోదీ ఉద్ఘాటన 

పౌరులపై వివక్షను తొలగించినప్పుడే అసలైన ప్రజాస్వామ్యం

అర్హులందరికీ పథకాలు అందినప్పుడే సామాజిక న్యాయం జరిగినట్లు

‘పీఎం జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్‌’ ప్రారంభం 

రూ.24 వేల కోట్లతో గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతులు  

కుంతీ: సమాజంలో అణగారిన వర్గమైన గిరిజనులకు న్యాయం చేకూర్చడానికి తమ ప్రభుత్వం ‘మిషన్‌ మోడ్‌’లో పని చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. గిరిపుత్రులకు తాను రుణపడి ఉన్నానని, ఆ రుణ తీర్చుకుంటానని తెలిపారు. గిరిజన యోధుడు బిర్సా ముండా జయంతి సందర్భంగా జార్ఖండ్‌లోని కుంతీ జిల్లాలో బుధవారం నిర్వహించిన  ‘జన జాతీయ గౌరవ్‌ దివస్‌’లో మోదీ పాల్గొన్నారు. బిర్సా ముండా జయంతిని పురస్కరించుకొని గిరిజనుల సంక్షేమం కోసం రూ.24,000 వేల కోట్లతో అమలు చేసే ‘పీఎం జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్‌’ను ప్రారంభించారు.

పలు ఇతర కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. కుంతీలోని ఫుట్‌బాల్‌ మైదానంలో బహిరంగ సభలో మోదీ ప్రసంగించారు. దేశ అభివృద్ధికి మహిళలు, రైతులు, యువత, మధ్యతరగతి–పేదలు అనే నాలుగు వర్గాలను బలోపేతం చేయడం చాలా కీలకమని ఉద్ఘాటించారు. బిర్సా ముండా జన్మించిన గడ్డకు గిరిజనుల రుణం తీర్చుకోవడానికి వచ్చానని అన్నారు. పౌరులపై అన్ని రకాల వివక్షను తొలగించినప్పుడే అసలైన ప్రజాస్వామ్యం సాధ్యమవుతుందని చెప్పారు. అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందినప్పుడే సామాజిక న్యాయం జరిగినట్లు భావించాలని స్పష్టం చేశారు.  

ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నా..  
అడవులు, మారుమూల ప్రాంతాల్లో అభివృద్ధికి దూరంగా నివసిస్తున్న గిరిజనుల కోసం ‘పీఎం జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్‌’ను ప్రారంభించినట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. ఈ పథకం కింద ఆయా ప్రాంతాల్లో అన్ని రకాల మౌలిక వసతులు కలి్పంచనున్నట్లు వివరించారు. రోడ్లు, టెలికాం వ్యవస్థ, విద్యుత్, గృహనిర్మాణం, సురక్షిత తాగు నీరు, పారిశుధ్య వసతులు, విద్యా, వైద్యం, జీవనోపాధి పథకాలు ఏర్పాటు చేస్తామన్నారు.

దేశవ్యాప్తంగా 22,000 గ్రామాల్లో అభివృద్ధికి దూరంగా నివసిస్తున్న 75 గిరిజన జాతులను ప్రభుత్వం గుర్తించిందని పేర్కొన్నారు. గిరిపుత్రుల బాగు కోసం గత ప్రభుత్వాలు చేసిందేమీ లేదని విమర్శించారు. వారి అభివృద్ధే ధ్యేయంగా ‘పీఎం జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్‌’ను ప్రారంభిస్తున్నామని అన్నారు. ఈ పథకం కింద రూ.24,000 కోట్లు ఖర్చు చేయబోతున్నామని ప్రకటించారు.

బిర్సా ముండాకు నివాళులు..
కుంతీ జిల్లాలోని ఉలీహతులో ప్రముఖ గిరిజన స్వాతంత్య్ర సమరయోధుడు బిర్సా ముండా జన్మ స్థలాన్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం సందర్శించారు. బిర్సా ముండా జయంతి సందర్భంగా ఆయన విగ్రహం వద్ద ఘనంగా నివాళులర్పించారు. బిర్సా ముండా జన్మించి నేలపై మట్టిని తీసుకొని మోదీ తిలకంగా ధరించారు. ఆయన పోరాటాలు, త్యాగాలను స్మరించుకున్నారు. ఉలీహతులో స్థానికులు మోదీకి సాదర స్వాగ తం పలికారు. ఈ సందర్భంగా సంప్రదాయ సంగీతానికి అనుగుణంగా గిరిజనులతో కలిసి మోదీ నృత్యం చేశారు.

వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర ప్రారంభం
కేంద్ర ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రజల వద్దకు తీసుకెళ్లడానికి ఉద్దేశించిన వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్రను ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించారు. అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల కింద లబ్ధి పొందనివారికి ఆయా పథకాల గురించి ఈ యాత్ర ద్వారా వివరిస్తారు. దేశవ్యాప్తంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో వచ్చే ఏడాది జనవరి 25 వరకూ ఈ యాత్ర కొనసాగుతుంది.
 
పీఎం–కిసాన్‌ సమ్మాన్‌ నిధి విడుదల
పీఎం–కిసాన్‌ సమ్మాన్‌ నిధి 15 విడత నిధులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం విడుదల చేశారు. దేశవ్యాప్తంగా 8 కోట్ల మందికిపైగా రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.18,000 కోట్ల నిధులను ఆన్‌లైన్‌ ద్వారా జమ చేశారు. ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో పీఎం–కిసాన్‌ సమ్మాన్‌ నిధిని ప్రధాని మోదీ విడుదల చేయడంపై కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్‌ రమేశ్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు