బోన్‌ఫైర్‌ వేడుకలు: ఒకేసారి దీపావళి, భోగి పండుగలా జరిగే సంబరం!

5 Nov, 2023 11:42 IST|Sakshi

ఇంగ్లండ్‌ ససెక్స్‌ కౌంటీ తూర్పు ప్రాంతంలోని లెవెస్‌ పట్టణం ‘బోన్‌ఫైర్‌ కేపిటల్‌ ఆఫ్‌ ద వరల్డ్‌’గా పేరు పొందింది. ఇక్కడ ఏటా నవంబర్‌లో జరిగే లెవెస్‌ బోన్‌ఫైర్‌ వేడుకలు చూస్తే, ఒకేసారి దీపావళి, భోగి పండుగ జరుగుతున్నట్లుగా ఉంటుంది. ఈ పండుగను సాధారణంగా నవంబర్‌ 5న జరుపుకొంటారు. నవంబర్‌ 5 ఆదివారం వచ్చినట్లయితే, ముందురోజే నవంబర్‌ 4న జరుపుకొంటారు.

ఈ వేడుకల్లో వీథి వీథినా భోగిమంటల్లాంటి చలిమంటల నెగళ్లను ఏర్పాటు చేస్తారు. ఆకాశం మిరుమిట్లు గొలిపేలా రకరకాల బాణసంచా కాల్పులతో హోరెత్తిస్తారు. సంప్రదాయ వేషధారణలతో కాగడాలు ధరించి ఊరేగింపులు జరుపుతారు. ఈ వేడుకల్లో స్థానిక ఇంగ్లండ్‌ వాసులతో పాటు, ఇక్కడ స్థిరపడిన ఆఫ్రికన్‌ జులు తెగ ప్రజలు కూడా పెద్దసంఖ్యలో పాల్గొంటారు. ఈ వేడుకలు జరుపుకోవడం వెనుక ఒక చారిత్రక సంఘటన ఉంది.

గన్‌పౌడర్‌ కుట్ర భగ్నం
ఇంగ్లండ్‌ రాజు ఒకటో జేమ్స్‌కు వ్యతిరేకంగా 1605 సంవత్సరంలో కొందరు కుట్ర పన్నారు. రాబర్ట్‌ కేట్స్‌బీ నాయకత్వంలో కొందరు కేథలిక్‌ నాయకులు రాజు ఒకటో జేమ్స్‌ను హతమార్చాలనుకున్నారు. రాజు ఒకటో జేమ్స్‌ ఇతర మతాల పట్ల ఉదారంగా ఉండటం వల్లనే కేథలిక్‌ నాయకులు అతణ్ణి హతమార్చాలని నిర్ణయించుకున్నారు. అందుకు వారు పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం రోజైన నవంబర్‌ 5న సభ కొలువుదీరిన సమయంలో హౌస్‌ ఆఫ్‌ లార్డ్స్‌ను గన్‌పౌడర్‌తో పేల్చివేయాలనుకున్నారు.

వీరి కుట్ర గురించి హౌస్‌ ఆఫ్‌ లార్డ్స్‌ సభ్యుడు ఒకరికి ముందుగానే ఒక ఆకాశరామన్న ఉత్తరం ద్వారా సమాచారం అందింది. భద్రతాధికారులకు చెప్పడంతో వారు సునాయాసంగా ఈ కుట్రను భగ్నం చేశారు. గన్‌పౌడర్‌ కుట్ర భగ్నమైన సందర్భంగా లెవెస్‌ పట్టణంలో ఏటా ఇలా బోన్‌ఫైర్‌ వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీగా సాగుతోంది.  

(చదవండి: ఆ టైంలోనే అతిపెద్ద అండర్‌గ్రౌండ్‌ ఎయిర్‌పోర్టు..కానీ ఇప్పుడది..)

మరిన్ని వార్తలు