గ్రీన్‌ల్యాండ్‌లో మంచు కనుమరుగు కానుందా?

24 Jun, 2019 05:09 IST|Sakshi

అవకాశం ఉందన్న తాజా సర్వే

వాషింగ్టన్‌: ప్రపంచవ్యాప్తంగా ఉత్పన్నమ వుతున్న కర్బనవాయువులు ఇదే వేగంతో పెరుగుతుంటే ఈ శతాబ్దం ముగిసేలోపే గ్రీన్‌ల్యాండ్‌లోని 4.5 శాతం మంచుకొండలు కరిగిపోయే ప్రమాదం ఉందని తాజా పరిశోధన వెల్లడించింది. దానితోపాటు సముద్ర మట్టాలు 13 అంగుళాల మేర పెరిగే అవకాశం ఉందని ఆ నివేదిక హెచ్చరించింది. ఉద్గారాలను తగ్గించకపోతే 3000 సంవత్సరం కల్లా గ్రీన్‌ల్యాండ్‌లోని మంచు పూర్తిగా కరిగే అవకాశం ఉందని అమెరికాలోని అలస్కా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌ ఆండీ ఆష్‌వాండెన్‌ తెలిపారు.

గ్రీన్‌ల్యాండ్‌లో 6,60,000 చదరపు కిలోమీటర్ల మేర మంచు పరచుకొని ఉంది. ఈ మంచుకొండల కింద ఉన్న ప్రాంతాల పరిస్థితులపై ఆయన అధ్యయనం చేశారు. దాదాపు 500 రకాల విభిన్న పరిస్థితులను అంచనా వేశారు. వీటిని అంచనా వేసే క్రమంలో పెద్ద మంచు పర్వతాలను కూడా పరిగణలోకి తీసుకున్నారు. వాటి నుంచి కరుగుతున్న హిమ శాతాన్ని కలిపి ఈ మేరకు అంచనాలు వేశారు. 1991, 2015 మధ్య సంవత్సరానికి 0.02 శాతం చొప్పున సముద్రమట్టం పెరిగిందని అన్నారు. గ్రీన్‌ల్యాండ్‌లోని మంచు పర్వతాలను కూడా పరిగణలోకి తీసుకొని పరిశోధన చేసిన మొదటి నివేదిక ఇదే కావడం గమనార్హం.

నగరాలకు ముంపు తప్పదు...
ఇప్పుడు ఉన్న కర్బన ఉద్గార శాతం ఇలాగే కొనసాగితే 3000 సంవత్సరం కల్లా సముద్రమట్టం 24 అడుగులు పెరుగుతుందని హెచ్చరించారు. దీనివల్ల సముద్రపు ఒడ్డున ఉన్న శాన్‌ ఫ్రాన్సిస్కో, లాస్‌ ఏంజెలస్, న్యూ ఓర్లాన్స్‌ వంటి నగరాలు సముద్రంలో మునగడం ఖాయమన్నారు. కర్బన వాయువులు పెరగకుండా జగ్రత్తలు తీసుకుంటే సముద్ర మట్టం కేవలం 6.5 అడుగులు మాత్రమే పెరిగే అవకాశం ఉందన్నారు.

మరిన్ని వార్తలు