Web Summit Lisbon: కలలను వదులుకోవద్దు...

18 Nov, 2023 00:45 IST|Sakshi

వెబ్‌ సమ్మిట్‌

ప్రపంచంలోనే అతిపెద్దదైన టెక్‌ కాన్ఫరెన్స్‌ వెబ్‌ సమ్మిట్‌ ఇటీవల పోర్చుగల్‌ రాజధాని లిస్బన్‌లో జరిగింది. ఈ వెబ్‌ సమ్మిట్‌కు 153 దేశాల నుండి 70 వేల మందికి పైగా సభ్యులు హాజరయ్యారు. వారిలో 43 శాతం మంది మహిళలు ఉన్నారు. ఇప్పటి వరకు రికార్డ్‌ స్థాయిలో మహిళలు పాల్గొన్న ఈవెంట్‌గా ఈ సదస్సు వార్తల్లో నిలిచింది.

గ్లోబల్‌ టెక్‌ ఇండస్ట్రీని రీ డిజైన్‌ చేయడానికి ఒక ఈవెంట్‌గా వెబ్‌ సమ్మిట్‌ను పేర్కొంటారు. ఇందులో 2,608 స్టార్టప్‌లు పాల్గొన్నాయి. వ్యాపార అవకాశాలను అన్వేషించడానికి, వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి కొత్త టెక్నాలజీని అందుకోవడానికి, సార్టప్‌లను ప్రదర్శించడానికి ఈ సమ్మిట్‌ వేదికగా నిలిచింది. ఇందులో స్టార్టప్‌ కంపెనీల సీఈఓలు, ఫౌండర్లు, క్రియేటివ్‌ బృందాలు, ఇన్వెస్టర్లు.. పాల్గొన్నారు. ఇందులో విశేషం ఏమంటే ప్రతి మూడవ స్టార్టప్‌... మహిళ సృష్టించినదే అయి ఉండటం. వెబ్‌సమ్మిట్‌ సీఈవో కేథరీన్‌ మహర్‌ ఈవెంట్‌ ప్రారంభంలో ‘స్టార్టప్స్‌ని మరింత శక్తిమంతంగా ముందుకు తీసుకెళ్లడానికి అత్యంత ముఖ్యమైన ప్రదేశం’గా పేర్కొన్నారు.

స్టార్టప్స్‌.. నైపుణ్యాలు
ప్రపంచవ్యాప్తంగా వేలాదిమంది తమ స్టార్టప్‌ల ద్వారా వెబ్‌ సమ్మిట్‌కు అప్లై చేసుకున్నారు. వాటిలో ఎంపిక చేసిన స్టార్టప్‌లను సమ్మిట్‌ ఆహ్వానించింది. కమ్యూనిటీ, పరిశ్రమలు, పర్యావరణ వ్యవస్థలపై సానుకూల ప్రభావం చూపే విధంగా పనిచేసే స్టార్టప్‌ల విభాగంలో 250 కంటే ఎక్కువ ఉన్నాయి. వంద మెంటార్‌ అవర్స్‌ సెషన్స్‌ ద్వారా 800 కంటే ఎక్కువ స్టార్టప్‌లు ఎక్స్‌పర్ట్స్‌ నుండి నైపుణ్యాలను నేర్చుకుంటారు. స్టార్టప్‌లలో ఎక్కువ ప్రాతినిధ్యం వహిస్తున్న పరిశ్రమలలో ఏఐ, మెషిన్‌ లెర్నింగ్, హెల్త్‌టెక్, వెల్‌నెస్, ఫిన్‌టెక్, ఫైనాన్షియల్‌ సర్వీసెస్, సస్టైనబిలిటీ, క్లీన్‌టెక్‌ .. వంటివి ఉన్నాయి.

కార్యాలయాలలో వేధింపులు
ఈవెంట్‌కు హాజరైన వారిలో మొత్తం 43 శాతం మంది మహిళలు ఉంటే, అత్యధికంగా 38 శాతం కంటే ఎక్కువ మంది మహిళా స్పీకర్లు ఉండటం విశేషం. అన్ని ఎగ్జిబిట్‌ స్టార్టప్‌ ఫౌండర్లలో దాదాపు మూడింట ఒక వంతు మహిళలే ఉన్నారు. ఈ సందర్భంగా వెబ్‌ సమ్మిట్‌ తన వార్షిక స్టేట్‌ ఆఫ్‌ జెండర్‌ ఈక్విటీ ఇన్‌ టెక్‌ నివేదికనూ విడుదల చేసింది. దాదాపు సగం మంది మహిళలు కార్యాలయంలో జెండర్‌ వివక్షను ఎదుర్కోవడంలో తగిన చర్యలు తీసుకోవడం లేదన్నారు.

53.6 శాతం మంది గడిచిన ఏడాదిలో తమ తమ ఆఫీసులలో లైంగిక వేధింపులను ఎదుర్కొన్నట్టు తెలిపారు. 63.1 శాతం మంది పెట్టుబడిదారులు కృత్రిమ మేధస్సు, యంత్రాలని నమ్మి తమ స్టారప్‌లలో వృద్ధిని సాధించినట్టు తెలియజేస్తే 43.2 శాతం మంది మాత్రం తమ కంపెనీలలో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచినట్టు పేర్కొన్నారు. అయినా, సీనియర్‌ మేనేజ్‌మెంట్‌ స్థానాల్లో మహిళల సంఖ్య గత ఏడాది కంటే 75 శాతం నుంచి 66.7 శాతానికి తగ్గినట్టు గుర్తించారు. ఈ సమ్మిట్‌... ప్రపంచంలో మహిళ స్థానం ఎలా ఉందో మరోసారి తెలియజేసింది.

ప్రపంచానికి మహిళ
పోర్చుగీస్‌ ఆర్థికమంత్రి ఆంటోనియా కోస్టా ఇ సిల్వా మాట్లాడుతూ ‘టెక్‌ ప్రపంచంలో ఎక్కువమంది మహిళలు అగ్రస్థానంలో ఉండాలి. వారి అవసరం ఈ ప్రపంచానికి ఎంతో ఉంది. మీ కలలను వదులుకోవద్దు. మహిళలకు అసాధారణమైన సామర్థ్యం ఉంది. సంక్షిష్టంగా ఉన్న ఈ ప్రపంచంలో మహిళల మల్టీ టాస్కింVŠ  మైండ్‌ చాలా అవసరం’ అని పేర్కొన్నారు. ఆశలకు, స్నేహానికి, కొత్త ఆలోచనలను అభివృద్ధి చేయడానికి, మన కాలపు సమస్యలను సవాల్‌ చేయడానికి ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలను ఒక చోట చేర్చడానికి వెబ్‌ సమ్మిట్‌ గొప్ప వేదిక’ అన్నారు.

ఇలాంటి అత్యున్నత వేదికలు ప్రపంచ మహిళ స్థానాన్ని, నైపుణ్యాలను, ఇబ్బందులను అందరి ముందుకు తీసుకువస్తూనే ఉంటాయి. మహిళలు తమ ఉన్నతి కోసం అన్నింటా పోరాటం చేయక తప్పదనే విషయాన్ని స్పష్టం చేస్తూనే ఉంటాయి.                         

మరిన్ని వార్తలు