భారత వైద్య దంపతులకు ఊరట

31 Mar, 2017 22:06 IST|Sakshi

గడువు ముగిసినా అమెరికాలో ఉండేందుకు ఆఖరి నిమిషంలో అనుమతి

హూస్టన్‌: వీసా గడువు ముగియడంతో గురువారం అమెరికా నుంచి స్వదేశానికి బయల్దేరబోతున్న భారత వైద్య దంపతులకు ఆఖరి క్షణంలో అదృష్టం కలిసొచ్చింది. మానవతా కారణాలతో వారు మరో 90 రోజులు అక్కడ ఉండేందుకు అధికారులు అనుమతిచ్చారు. అక్రమ వలసదారులపై కొరడా ఝుళిపిస్తున్న ఆ దేశంలో ఇలాంటి పరిణామం చోటుచేసుకోవడం విశేషమే. పంకజ్‌ సాతిజా, ఆయన భార్య మోనికా ఉమ్మత్‌ అమెరికాలో గత 15 ఏళ్లుగా న్యూరాలజిస్టులుగా పనిచేస్తున్నారు.

గత అక్టోబర్‌లో అనారోగ్యంతో బాధపడుతున్న పంకజ్‌ తండ్రిని చూడటానికి వాళ్లు భారత్‌ వచ్చినపుడు అసలు సమస్య మొదలైంది. తిరిగి అమెరికా చేరుకున్న సమయంలో బుష్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో వారిని అడ్డుకున్న కస్టమ్స్‌ అండ్‌ బోర్డర్‌ ప్రొటెక‌్షన్‌ అధికారులు వారి వీసా ఈ ఏడాది జూన్‌తో ముగియనున్నట్లు స్టాంప్‌ వేశారు. అయితే వారి ప్రయాణ పత్రాలకు గతేడాది జూన్‌లోనే గడువు తీరిందని అమెరికా సిటిజెన్‌షిప్‌, ఇమి‍గ్రేషన్‌ సర్వీసెస్‌ పేర్కొంది. ఈ రెండింటి మధ్య తారతమ్యాలను సరిదిద్దుకోవడానికి వాళ్లను తాత్కాలికంగా దేశంలోకి అనుమతించారు.

కానీ, పంకజ్‌ దంపతులిద్దరూ తమ ఇద్దరు పిల్లలతో కలిసి 24 గంటల్లో అమెరికా విడిచివెళ్లాలని బుధవారం ఇమిగ్రేషన్‌ అధికారలు హఠాత్తుగా చెప్పారు. దీంతో వారు తమ లాయర్లు, మీడియాతో కలిసి తమ చట్ట సభ్యుల్ని కలుసుకోవడంతో తాత్కాలికంగా ఊరట లభించింది. వారిప్పుడు వెనుదిరిగితే రోగులకు నష్టం కలుగుతుంది కాబట్టి తమ విధులు పూర్తిచేయడానికి మరో మూడు నెలలు అక్కడ ఉండేందుకు అవకాశమిచ్చారు.

మరిన్ని వార్తలు