క్రిమినల్స్‌ లాగా చూస్తున్నారు.. 24 గంటలూ సంకెళ్లే...

16 Jul, 2018 21:34 IST|Sakshi

అమెరికా జైలులో భారత శరణార్థుల దుస్థితి... 

అమెరికా అధ‍్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ’జీరో టాలరెన్స్‌ పాలసీ’లో భాగంగా అరెగాన్‌ రాష్ట్రంలోకి అక్రమంగా అడుగుపెట్టిన 123 మందిని అరెస్ట్‌చేసి అమానవీయ పరిస్థితుల్లో జైల్లో పెట్టిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. వీరిలో 52 మంది భారతీయులు, వారిలోనూ 18, 20,22 ఏళ్ల మధ్యలో ఉన్న  సిక్కు యువకులు మెజారిటీ సంఖ్యలో ఉన్నారు . అరెగాన్‌లోని షెరిడాన్‌ ఫెడరల్‌ జైలులో వీరిని క్రిమిన ల్స్‌గా చూస్తున్నారని, 24 గంటల పాటు సంకెళ్లలోనే ఉంచడంతో పాటు వారి తలపాగాలు కూడా లాగిపారేసి జంతువులుగా చూస్తూ తీవ్ర అవమానాల పాలు చేస్తున్నట్టు బయటపడింది. అమెరికాలో ఆశ్రయం కోసం వచ్చి కొన్ని వారాలుగా  జైలుశిక్షను అనుభవిస్తున్న వారికి న్యాయపరమైన సలహాలు,సూచనలిచ్చేందుకు వెళ్లిన స్వచ్చందసంస్థల ప్రతినిధుల ద్వారా ఈ వ్యవహారం వెలుగు చూసింది.

అరెగాన్‌లో కమ్యూనిటీ కాలేజీ ప్రొఫెసర్‌గా ఉన్న నవనీత్‌కౌర్‌ ’పంజాబీ ట్రాన్స్‌లేటర్‌’గా 52 మంది భారతీయులతో మాట్లాడారు. అమెరికా చట్టప్రకారం శరణార్ధిగా పరిగణించే లేదా ప్రవాసం కోరుకునే వారిని అమానవీయంగా చూడడం సరికాదంటున్నారామే. భారతీయులను అరెస్ట్‌ చేసి  24 గంటలు సంకెళ్లతోనే ఉంచారని, రోజుకు 22 గంటలు తమ భాష తెలియని వారితో కలిసి జైలుగదిలో ఉంచడం ఏమాత్రం మానవత్వం అనిపించుకోదన్నారు. ఎవరైన తమ తమ మత విశ్వాసాలను కొనసాగించే  హక్కున్న అమెరికా వంటి దేశంలో సిక్కుల తలపాగలను లాగిపారేసి అవమానించడం గర్హనీయమని ఆమె పేర్కొన్నారు. వీరికి న్యాయసహాయం అందించేందుకు అధికారులకు దరఖాస్తు చేయడంతో పాటు, ఆశ్రయం కోరుతున్న భారతీయులందరికీ  సహాయపడేందుకు  ’ద ఇన్నోవేషన్‌ లా లాబ్‌’ ముందుకొచ్చింది.

తమ దేశంలో రాజకీయంగా, మతపరంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని, తమ ›ప్రాణాలకు రక్షణ లేదని  అమెరికాలో ఆశ్రయం కోసం  వీరంతా మొరపెట్టుకున్నట్టు తెలుస్తోంది.  అరెగాన్‌ జైలులో ఉన్న వారిని ఇటీవల సాన్‌ఫ్రాన్సిస్‌కోలోని భారత కాన్సులేట్‌ కార్యాలయ అధికారులు కలుసుకుని వారి సాధకబాధకాలు తెలుసుకున్నారు. ఇంతటి అమానవీయ పరిస్థితులను ఎదుర్కుంటున్నా ఈ శిక్ష అనుభిస్తున్న వారెవరూ కూడా భారత్‌కు తిరిగివెళ్లేందుకు సంసిద్ధంగా లేరని నవనీత్‌కౌర్‌తో పాటు ఇనో‍్నవేషన్‌ లాబ్‌ డైవలప్‌మెంట్‌ డైరెక్టర్‌ విక్టోరియా బెజరానో మ్యూర్‌హెడ్‌ చెబుతున్నారు.
 
 

మరిన్ని వార్తలు