10 రోజుల్లో ‘అణు’ పరిమితిని దాటేస్తాం

18 Jun, 2019 06:21 IST|Sakshi

యూరప్‌ దేశాలకు ఇరాన్‌ హెచ్చరిక

టెహ్రాన్‌: అమెరికా ఆర్థిక ఆంక్షలు కుంగదీస్తున్న వేళ ఇరాన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. అణుఒప్పందం ప్రకారం 300 కేజీలకు మించి యురేనియంను శుద్ధి చేయరాదన్న పరిమితిని ఉల్లంఘిస్తామని  యూరప్‌ దేశాలను హెచ్చరించింది. రాబోయే 10 రోజుల్లో ఈ లక్ష్యాన్ని దాటేస్తామని ఇరాన్‌ అణుశక్తి సంస్థ అధికార ప్రతినిధి బెహ్రౌజ్‌ కమల్‌వాండీ తెలిపారు. యూరప్‌ దేశాలు మౌనం వహిస్తే, ఇదే పరిస్థితి కొనసాగితే అసలు అణు ఒప్పందం అనేదే ఉండదని తేల్చిచెప్పారు.

ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు విధించిన నేపథ్యంలో పరిష్కారం కనుగొనకుండా యూరప్‌ దేశాలు మౌనం వహించడంపై ఆయన అసహనం వ్యక్తంచేశారు. సాధారణంగా అణుఇంధన రియాక్టర్లలో 20 శాతం వరకూ శుద్ధిచేసిన యురేనియంను వాడతారు. 85 శాతం, అంతకంటే ఎక్కువగా శుద్ధిచేసిన యురేనియంను అణ్వాయుధాల తయారీకి వినియోగిస్తారు. 2015లో అమెరికా, రష్యా, చైనా, జర్మనీ, బ్రిటన్, ఫ్రాన్స్‌ దేశాలు ఇరాన్‌తో అణు ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దీనిప్రకారం ఇరాన్‌పై ఆంక్షలను ఎత్తివేశారు. ప్రతిగా 3.67 శాతం శుద్ధిచేసిన 300 కేజీల యురేనియంను మాత్రమే ఇరాన్‌ నిల్వ చేసుకోవాల్సి ఉంటుంది.

మరిన్ని వార్తలు