లవ్‌ స్టోరీ చెప్పిన భార్య: తొలి బిడ్డను కోల్పోయాం.. వివేక్‌రామస్వామి భావోద్వేగం

20 Nov, 2023 16:19 IST|Sakshi

అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన, పారిశ్రామికవేత్త,భారతీయ సంతతికి చెందిన  వివేక్‌ గణపతి రామస్వామి తనదైన శైలిలో  దూసుకు పోతున్నారు.  ఈక్రమంలో అయోవాలో జరిగిన ఒక కార్యక్రమంలో భార్య అపూర్వ, కుమారుడితో కలిసి  పాల్గొన్నారు. ఈ సందర్భంగా  తన వ్యక్తి త జీవితానికి  సంబంధించిన కొన్ని విషయాలను షేర్‌ చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. దీనికి సంబంధించిన  వీడియోలను వివేక్‌ను ట్విటర్‌లో షేర్‌ చేశారు.

తన భార్యకు గర్భం దాల్చి మూడున్నర నెలలకే గర్భస్రావం జరిగిందని ఇది తమకు చాలా బాధకరమైన క్షణమని పేర్కొన్నారు.  ముఖ్యంగా తొలి బిడ్డను కోల్పోవడతో రెండోసారి  కూడా  ఆ  భయం వెంటాడిందన్నారు.  కానీ ఆ భగవంతుడిమీద విశ్వాసంతోనే  ధైర్యాన్ని తెచ్చు కున్నామని, అలా కార్తీక్‌ , అర్జున్‌ వచ్చారని తమ  జీవితాల్లోరావడంతో సంతోషం నిండిందంటూ అయోవాలోని ఫ్యామిలీ లీడర్ థాంక్స్ గివింగ్ ఫ్యామిలీ ఫోరమ్‌లో రామస్వామి తన అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. 

తన విశ్వాసమే తన  స్వేచ్ఛ ను ఇచ్చిందనీ అదే ఈ అధ్యక్ష ఎన్నికల ప్రచారానికి నడిపించిందని చెప్పుకొచ్చాడు. దేవుడు ఒక్కడే  అని తాను విశ్వసిస్తానన్నారు. అలాగే తల్లితండ్రుల పెంపకం, వారి  పట్ల గౌరవం  వివాహం, ఇతర  సాంప్రదాయ విలువల్ని వారి నుంచి నేర్చుకున్నానన్నారు.  హిందూ విశ్వాసం, సిద్ధాంతాలు, క్రైస్తవ ఉన్నత పాఠశాలలో చదువుతున్నప్పుడు నేర్చుకున్న క్రైస్తవ విలువల మధ్య సారూప్యాన్ని  ప్రస్తావించారు. ఇవి మతపరమైన సరిహద్దులను అధిగమించి ఉన్నతమైన దైవిక శక్తికి చెందినవని  పేర్కొన్నారు.

అటు రామస్వామి భార్య అపూర్వ  కూడా తమ ప్రేమ ఎలా మొదలైందీ పంచుకున్నారు. తొలుత ఒక  కాలేజీ పార్టీలో కలుసుకున్నామని తెలిపారు. మెడ్ స్కూల్‌లో  ఉండగా,  వివేక్ అక్కడ న్యాయ విద్యార్థిగా ఉన్నారు. అక్కడ వివేక్‌ను చూశాను...చాలా ఆసక్తికరమైన వ్యక్తిగా అనిపించాడు. వెంటనే వెళ్లి వివేక్‌ను పరిచయం చేసుకున్నానని కానీ  అపుడు  వివేక్‌ పెద్ద ఆసక్తి చూపించలేదన్నారు. కానీ  అప్పటినుంచి తరచు కలుసుకుంటూ, తాము పరస్పరం ఎంత దగ్గరి వారిమో  గుర్తించాం.  అప్పటినుంచీ కలిసే ఉన్నామని  తెలిపారు. 

కాగా వివేక్‌ రామస్వామి తండ్రి వీజీ రామస్వామి జనరల్‌ ఎలక్ట్రిక్‌లో ఇంజినీర్‌గా పనిచేశారు. తల్లి గీతా రామస్వామి వృద్ధులకు సంబంధించిన జీరియాట్రిక్‌ సైకియాట్రిస్టు.  భార్య అపూర్వ సర్జన్‌. యేల్‌ విశ్వవిద్యాలయంలో పరిచయం వీరి పెళ్లికి దారితీసింది.  2015లో అపూర్వ తివారీని వివాహం చేసుకున్నారు వీరికి ఇద్దరు అబ్బాయిలు. 2023 ఆగస్టు నాటి ఫోర్బ్స్‌ నివేదిక ప్రకారం వివేక్‌ రామస్వామి సంపద విలువ 95 కోట్ల అమెరికన్‌ డాలర్లకు పైమాటే. అమెరికాలో 2024 అధ్యక్ష ఎన్నికలు నవంబర్ 5, 2024 మంగళవారం జరగనున్నాయి. 

మరిన్ని వార్తలు