విమానం కోసం వెతుకులాట ఏడాదైనా పట్టొచ్చు

31 Mar, 2014 12:00 IST|Sakshi
విమానం కోసం వెతుకులాట ఏడాదైనా పట్టొచ్చు
దక్షిణ హిందూ మహాసముద్రం లో ఆస్ట్రేలియాకి వెయ్యి కి.మీ దూరంలో సముద్రం అడుగున రెండు మైళ్ల లోతున....కనిపించని మలేషియన్ విమానం కోసం, కనుమరుగైన 239 మంది ప్రయాణికుల కోసం ప్రపంచం ఇప్పుడు వెతుకుతోంది. 
 
విమానం ఇక్కడే కూలిందా అంటే ఎవరు చెప్పలేకపోతున్నారు. ఈ ప్రాంతంలో సముద్రం పైన తేలాడుతున్న ఎన్నో వస్తువులను పడవలు సేకరించాయి. కానీ అవేవీ విమాన శకలాలు కావు. 
 
సముద్ర గర్భాన్ని వడకట్టి, జల్లెడపట్టే శాస్త్రవేత్తలు చెబుతున్న దాని ప్రకారం ఈ ప్రాంతం వైశాల్యం దాదాపు 319 వేల చకిమీ. అంటే పోలండ్ దేశంతో సమానం. అదృష్ట వశాత్తూ ఈ ప్రాంతంలో సముద్రం అట్టడుగుభాగం చదునుగా, పెద్దగా ఎగుడు దిగుళ్లు లేకుండా ఉంటుంది. మధ్యలో ఒక ప్రాంతం మాత్రం కాస్త పగులు ఉన్నట్టుగా ఉంటుంది. దీన్ని డయామాంటినా ట్రెంచ్ అంటారు. అయితే సముద్రం అట్టడుగున చనిపోయిన ప్లాంక్టన్ జాతి ప్రాణులు ఒక కిలో మీటర్ వరకూ ఒక తివాచీలాగా పరుచుకుని ఉంటాయి. ఈ ట్రెంచ్, ప్లాంక్టన్ల వల్ల శకలాలను గుర్తించే పరికరాలకు అట్టడుగు నుంచి సిగ్నల్స్ అందడంలో ఇబ్బందిగా ఉంది. ఇంత సువిశాల ప్రాంతంలో కూలిన విమానపు బ్లాక్ బాక్స్ కోసం వెతకడం అంటే గడ్డివాములో సూది వెతకడం లాంటిదేనంటున్నారు నిపుణులు. 
 
 అందుకే శాస్త్రవేత్తలు ఈ విమానం కోసం అన్వేషణ ఏడాదిపాటు కొనసాగినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. మొత్తం మీద ఎం హెచ్ 370 విమానం ఒక అద్భుత మిస్టరీగా మిగిలిపోయే అవకాశాలే ఎక్కువని వారంటున్నారు. 
మరిన్ని వార్తలు