జార్జ్‌ ఫ్లాయిడ్‌ సోదరుడి ఆవేదన

11 Jun, 2020 13:17 IST|Sakshi

వాషింగ్టన్‌:  తన సోదరుడిలా నల్లజాతీయులెవరూ అమెరికా పోలీసుల దాష్టీకాలకు బలికాకుండా చూడాలని ఆఫ్రికన్‌ అమెరికన్‌ జార్జ్‌ ఫ్లాయిడ్‌ తమ్ముడు ఫిలోనిస్ ఫ్లాయిడ్ కోరుకున్నారు. జార్జ్‌ హత్య విచారణలో భాగంగా అమెరికా చట్టసభ(కాంగ్రెస్‌) ఎదుట ఆయన వాంగ్మూలం ఇచ్చారు. అగ్రరాజ్యంలో నల్లజాతీయులపై దారుణాలు కొనసాగుతుండటం పట్ల ఫిలోనిస్ ఆందోళన వ్యక్తం చేస్తూ ఉద్వేగానికి లోనయ్యారు.

‘నేను అలిసిపోయాను. ఇప్పుడు అనుభవిస్తున్న బాధతో నేను విసిగిపోయాను. ఎటువంటి కారణం లేకుండా నల్లజాతీయులు చంపబడిన ప్రతిసారీ అనుభవిస్తున్న బాధతో నేను వేసారిపోయాను. దీన్ని ఆపమని మిమ్మల్ని అడగడానికి నేను ఈ రోజు ఇక్కడకు వచ్చాను. ఈ బాధలు ఇక వద్దు’ అని ఫిలోనిస్ ఫ్లాయిడ్ గద్గత స్వరంతో అన్నారు. జార్జ్‌ తమ్ముడి మాటలతో విచారణ గది నిశ్శబ్దంగా మారిపోయింది. ఒక నల్లజాతీయుడి ప్రాణం విలువ 20 వేల డాలర్లా? ఇది 2020. ఇక చాలు’ అన్న ఫిలోనిస్ ఆవేదన అందరినీ కదిలించింది. (ఫ్లాయిడ్‌కు కన్నీటి వీడ్కోలు)

ఆ వీడియో బాధ కలిగిస్తోంది..
‘మంచి పనులు చేస్తూ ఈ దేశానికి, ప్రపంచానికి అవసరమైన నాయకులుగా ఉండండి. పోలీసు హింస, అన్యాయానికి జార్జ్ ఫ్లాయిడ్ మరణం ప్రపంచ ప్రతీక నిలిచింది. కానీ జీవితంలో అతడు తండ్రి, సోదరుడు, సౌమ్యుడైన దిగ్గజం’ అని చట్టసభ సభ్యులతో ఫిలోనిస్ అన్నారు. జార్జ్ ఫ్లాయిడ్ మెడపై  ఒక పోలీసు అధికారి మోకాలు ఉంచి ఊపిరాడకుండా చేసిన వీడియో న్యాయం కోసం చేసే ఉద్యమాలకు కొత్త ఊపిరి పోసినప్పటికీ.. పదేపదే జార్జ్ చివరి క్షణాలను గుర్తుచేయడం తమ కుటుంబానికి చాలా క్షోభ కలిగిస్తోందన్నారు. ‘నేను ఆ వీడియో గురించి పదే పదే ఆలోచిస్తాను. మనుషులతో ఎవరూ అలా ప్రవర్తించరు. జంతువులను కూడా అలా చేయరు’ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. తన సోదరుడి చావుకు కారణమైన పోలీసులను శిక్షించి తమకు న్యాయం చేయాలన్నారు. పోలీసు వ్యవస్థను ఇప్పటికైనా సంస్కరించాలని అమెరికా చట్టసభకు విన్నవించారు. తన సోదరుడి మరణం వృధా కాకుండా ఉండాలంటే వైట్‌హౌస్‌ సమీపంలోని వీధికి పెట్టిన ‘బ్లాక్‌ లైవ్స్ మేటర్’ పేరును కొనసాగించాలని ఫిలోనిస్ కోరారు. (అమెరికా ఆత్మను తట్టిలేపిన జార్జ్‌ )

కరోనా కారణంగా వర్చువల్‌ విధానంలో విచారణ చేపట్టారు. ఫ్లాయిడ్ కుటుంబం తరపు న్యాయవాది బెంజమిన్ క్రంప్‌, పౌర హక్కుల నాయకులు, చట్టసభ సభ్యులు సహా కొంతమంది మాత్రమే ముఖానికి మాస్కులతో విచారణకు హాజరయ్యారు. పోలీసులు అనుసరిస్తున్న పద్ధతులు, జవాబుదారీతనంలో సంస్కరణలు చేపట్టాలని బెంజమిన్ క్రంప్‌ ఈ సందర్భంగా పేర్కొన్నారు. కాగా, పోలీసు విభాగానికి బడ్జెట్‌ను కోత పెట్టాలని, ఈ నిధులను సామాజిక సేవకు వినియోగించాలని ఆందోళకారులు డిమాండ్‌ చేస్తున్నారు. (పోలీస్‌ విభాగం రద్దుకు ఓటు)

మరిన్ని వార్తలు