పాక్‌కు సాయం ఆపండి

20 Nov, 2023 06:18 IST|Sakshi

బైడెన్‌కు అమెరికా కాంగ్రెస్‌ సభ్యుల విజ్ఞప్తి

ఇస్లామాబాద్‌: అమెరికా అందిస్తున్న భారీ ఆర్థిక సాయాన్ని మానవ హక్కుల ఉల్లంఘనకు పాకిస్తాన్‌ వినియోగిస్తోందని యూఎస్‌ కాంగ్రెస్‌ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. పాక్‌లో స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు జరిగి రాజ్యాంగబద్ధమైన రీతిలో ప్రభుత్వం ఏర్పాటయ్యేదాకా ఆ దేశానికి ఎలాంటి ఆర్థిక సాయమూ అందించొద్దని అధ్యక్షుడు జో బైడెన్‌కు విజ్ఞప్తి చేశారు. ఇలాన్‌ ఒమర్‌తో పాటు మరో 10 మంది కాంగ్రెస్‌ సభ్యులు ఈ మేరకు అమెరికా విదేశాంగ మంత్రి అంటోనీ బ్లింకెన్‌కు లేఖ రాశారు.

దైవ దూషణ చట్టాన్ని మరింత కఠినతరం చేయడం తదితర చర్యలకు పాక్‌ పాల్పడుతున్న వైనాన్ని అందులో ప్రస్తావించారు. ‘‘ఇవన్నీ పాక్‌లోని మతపరమైన మైనారిటీలను మరింతగా అణచివేసేందుకు తీసుకుంటున్న చర్యలే. ఎందుకంటే దైవదూషణ బిల్లును పాక్‌ పార్లమెంటు ఆమోదించిన కొద్ది రోజులకే మతోన్మాద మూకలు చర్చిలను ధ్వంసం చేయడంతో పాటు క్రైస్తవుల ఇళ్లకు నిప్పు పెట్టాయి’’ అంటూ వారు ఆందోళన వెలిబుచ్చారు. 

మరిన్ని వార్తలు