మేఘన్‌ మార్కెల్‌ కొత్త అవతారం

11 Jan, 2020 16:17 IST|Sakshi
మేఘన్‌ మా‍ర్కెల్‌ (ఫైల్‌ ఫోటో)

లండన్‌ : ఆర్థికంగా స్వతంత్రంగా ఉంటామని ప్రకటించిన బ్రటిన్‌ రాజకుమారుడు 'డ్యూక్ ఆఫ్ ససెక్స్' ప్రిన్స్‌ హ్యారీ, ఆయన భార్య 'డచెస్ ఆఫ్ ససెక్స్' మేఘన్ మార్కెల్ అప్పుడే ఆ పనిలో పడినట్టు కనిపిస్తోంది.  పెళ్లికి ముందు వదిలేసిన వృత్తిని మేఘన్‌ తిరిగి చేపట్టారు. ఇందుకోసం డిస్నీ లండన్‌తో ఒక  ఒప్పందం కుదుర్చుకున్నారు. సీనియర్ రాయల్స్ పదవి నుంచి  వైదొలగాలనే నిర్ణయాన్ని  వెల్లడించిన మేఘన్ డిస్నీ లండన్‌తో వాయిస్‌ ఓవర్  చెప్పేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆరు వారాల విరామం కోసం  కెనడాకు బయలుదేరే ముందే నవంబర్‌లో ఆమె వాయిస్‌ఓవర్‌ను రికార్డ్ చేశారట.

2017లో హ్యారీతో నిశ్చితార్థం తరువాత నటనకు గుడ్‌ బై చెప్పిన మాజీ నటి  మేఘన్‌ తాజాగా డిస్నీతో ఒప్పందం చేసుకున్నారు. ఎనుగుల పరిరక్షణకు, వేటగాళ్ల  బారి నుంచి రక్షించేందుకు ఉద్దేశించిన పరిరక్షణా బృందం ‘ఎలిఫెంట్‌ వితౌట్‌ బోర్డర్స్‌’ అనే స్వచ్ఛంద సంస్థకు విరాళం ఇచ్చేందుకు బదులుగా స్టూడియోతో కలిసి పనిచేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు టైమ్స్ పేర్కొంది. కాగా బ్రిటన్ రాజకుటుంబ 'సీనియర్ సభ్యుల' బాధ్యతల నుంచి వైదొలగుతామని, బ్రిటన్, ఉత్తర అమెరికా రెండింటిలో ఉండే విధంగా సమతూకంతో సమయం కేటాయించుకొనేందుకు సన్నాహాలు చేస్తున్నామని, అదే సమయంలో రాణికి (ఎలిజిబెత్‌-2)సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు. అలాగే రాజకుటుంబ సంప్రదాయాల పట్ల తమ కుమారుడు ఆర్చీ హారిసన్‌కు అవగాహన కల్పించడంతోపాటు, కొత్తగా సేవాసంస్థ ఏర్పాటు సహా జీవితంలోని తదుపరి అధ్యాయంపై దృష్టి కేంద్రీకరించే వీలవుతుందని  చెప్పారు. మరోవైపు హ్యారీ-మేఘన్ ప్రకటన రాజకుటుంబానికి అసంతృప్తి కలిగించిందని రాజప్రాసాదం బకింగ్‌హాం ప్యాలస్ అధికారులు పేర్కొన్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు