Argoland continent: 15.5 కోట్ల సంవత్సరాల క్రితం మాయం.. ఆసియా ఖండంలో ప్రత్యక్షం!

16 Nov, 2023 16:49 IST|Sakshi

15.5 కోట్ల  ఏళ్ల క్రితం మాయమైన ఖండాన్ని ఆసియా ఖండంలో శాస్త్రవేత్తలు గుర్తించారు.  ‘ఆర్గోల్యాండ్‌’ (Argoland) అని పిలిచే ఈ ఖండానికి సంబంధించిన శకలాలను ఆగ్నేయాసియాలో కనుగొన్నారు. ఈ శకలాలు మొదట్లో ఆస్ట్రేలియా ఖండంలో భాగంగా ఉండేవి.  తర్వాత ఇండోనేషియా తూర్పు భాగం వైపు మళ్లాయి. ఒకప్పుడు  15.5 కోట్ల సంవత్సరాల పురాతన భూభాగంలో భాగంగా ఉండే ఈ ఖండం యునైటెడ్ స్టేట్స్ మాదిరిగా చాలా పెద్దగా విస్తరించి ఉండేది.

ఆర్గోల్యాండ్‌ శకలాల పరిశోధన ఏడేళ్లపాటు సాగిందని నెదర్లాండ్స్‌లోని ఉట్రేచ్ట్ విశ్వవిద్యాలయానికి చెందిన భూవిజ్ఞాన శాస్త్రవేత్త, రచయిత ఎల్డర్ట్ అడ్వోకాట్ పేర్కొన్నారు.  ఆగ్నేయాసియా ప్రాంతంలో  అక్కడక్కడా విసిరేసినట్టుండే ఈ శకలాలు ఒకే భూభాగం నుంచి వేరుపడినవని కనుగొనేందుకు శాస్త్రవేత్తలు చాలా కష్టపడ్డారు. ఈ శకలాల వరుసను ‘ఆర్గోలాండ్’ అని పిలిచేవారు. ప్రారంభంలో ఇదంతా ఒకే భూభాగంగా ఉండేది.

15.5 కోట్ల ఏళ్ల నాటి ప్రస్థానం
ఆగ్నేయాసియా భూభాగం ఆఫ్రికా, దక్షిణ అమెరికా వంటి ఖండాల మాదిరిగా కాకుండా అనేక శకలాలుగా విచ్ఛిన్నమై ఉంటుంది. దీంతో ఆర్గోల్యాండ్ అనేక ముక్కలుగా విడిపోవడంతో దాని ఉనికి మరుగునపడిపోయింది. ప్రస్తుతం ఈ శకలాలకు సంబంధించి లభ్యమైన మ్యాప్‌ ఆధారంగా ఆర్గోల్యాండ్ అదృశ్యం కాలేదని పరిశోధకులు కనుగొన్నారు. ఈ ఆవిష్కరణతో శాస్త్రవేత్తలు 15.5 కోట్ల నాటి ఆర్గోల్యాండ్ ప్రస్థానాన్ని గుర్తించారు. ఇది దృఢమైన ఒకే భూభాగం కాకుండా సూక్ష్మఖండాల శ్రేణి కాబట్టి ఈ ఖండానికి శాస్త్రవేత్తలు ఆర్గోల్యాండ్‌కు బదులుగా ‘ఆర్గోపెలాగో’ అని పేరు పెట్టారు.

సైన్స్‌ జర్నల్ ‘గోండ్వానా రీసెర్చ్‌’లో అక్టోబరు 19న ప్రచురితమైన ఈ పరిశోధన భూ గ్రహం పరిణామం గురించిన ఆధారాలను అందించడమే కాకుండా ప్రస్తుత జీవవైవిధ్యం, పర్యావరణ వ్యవస్థలు ఎలా అభివృద్ధి చెందాయనే విషయాలను కూడా వెలుగులోకి తెచ్చింది.

మరిన్ని వార్తలు