ట్రంప్‌ నిర్ణయాన్ని వ్యతిరేకించిన మిసెస్‌ ట్రంప్‌

18 Jun, 2018 10:59 IST|Sakshi
మెలానియా ట్రంప్‌ (పాత ఫోటో)

వాషింగ్టన్‌ : డోనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి వలసదారుల పట్ల ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నారో తెలిసిన విషయమే. మెక్సికో నుంచి వచ్చే అక్రమ వలసదారులను అరికట్టేందుకు ఏకంగా మెక్సికో - అమెరికా సరిహద్దులో గోడ నిర్మిస్తానన్న సంగతి విధితమే. గోడనైతే నిర్మించలేదు కానీ అంతకంటే కఠిన చట్టాలు చేసి వలసదారులకు ట్రంప్‌ చుక్కలు చూపిస్తున్నారు. ట్రంప్‌ అనుసరిస్తున్న ‘కఠిన సరిహద్దు భద్రతా విధానం’ పట్ల అమెరికాలోని అన్ని రాజకీయ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ విషయంలో ప్రతిపక్షం నుంచే కాక స్వయంగా స్వపక్షం నుంచి కూడా  విమర్శలు ఎదురవుతుండటం గమనార్హం. చివరకు అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌ కూడా వలసదారుల పట్ల ట్రంప్‌ ప్రవర్తిస్తున్న తీరును తప్పు పట్టారు.

నిన్న ప్రపంచవ్యాప్తంగా ‘ఫాదర్స్‌ డే’ జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మెలానియా ట్రంప్‌...‘చట్టాలు నిక్కచ్చిగా అమలు చేసే దేశం, అమెరికా అంటే నాకు నమ్మకం ఉంది. కేవలం చట్టాలతో మాత్రమే కాక హృదయంతో కూడా పాలన కొనసాగడం మరింత శ్రేయస్కరం. వలసదారులను వెనక్కి పంపించే క్రమంలో చాలామంది పిల్లలను వారి కుటుంబాల నుంచి వేరు చేస్తున్నారు. ఇది సరైన పద్దతి కాదు. ఈ జఠిల సమస్య పరిష్కారానికి ఇరు రాజకీయ పార్టీలు ముందుకు రావాలి. ఇరువురు ఉమ్మడిగా ఆలోచించి సరైన వలసదారుల విధానాన్ని రూపొందించాలి’ అన్నారు.

ఇదిలా ఉండగా ట్రంప్‌ ప్రభుత్వం కొన్ని రోజుల కిందట ‘వలసదారుల అమెరికా విడిచి పోవాల్సింది’గా ఆదేశాలు జారీ చేయడమే కాక అందుకు ఆరు వారాల గడువు విధించింది. ఇచ్చిన గడువు లోపు వలసదారులు వారి దేశాలకు తిరిగి వెళ్లాలి. లేదంటే వారిని అరెస్టు చేస్తామని ఆదేశించింది. అంతేకాక వలసదారుల పిల్లలకు అమెరికాలోనే ఆశ్రయం కల్పిస్తామని ప్రకటించింది. ఈ ప్రకటన వెలువడిన నేపధ్యంలో దాదాపు 2 వేల మంది మైనర్‌ పిల్లలను వారి కుటుంబం నుంచి వేరు చేసి, వారిని శరణార్ధుల శిబిరానికి తరలించారు.

అయితే ట్రంప్‌ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ట్రంప్‌ చర్యలు పిల్లలను తీవ్రంగా అవమానించేలా ఉన్నాయని...ఈ చర్యలు వారి భవిష్యత్తుపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతాయని నెటిజన్లు విమర్శిస్తున్నారు.

మరిన్ని వార్తలు