మాట తప్పితే ఇక్కడ ఇంతే..

27 May, 2018 01:16 IST|Sakshi

అది చేస్తాం.. ఇది చేస్తాం. ఆకాశాన్ని కిందకి తెస్తాం.. భూమిని పైకి పంపుతాం.. ఇదిగో ఇలా మన నాయకులు ఎన్నికల్లో ఇచ్చే హామీలకు హద్దూపద్దు ఉండదు. వేల కొద్దీ హామీలిచ్చి ఎలాగొలా గెలిచాక.. హామీలన్నీ అంత:కరణ శుద్ధితో పక్కన పడేస్తారు. ఇలా చేసే నాయకులను మన దేశంలోనైతే ఏం చేస్తాం.. ఏం చేయం.. ఐదేళ్ల వరకు వెయిట్‌ చేస్తాం. కానీ మెక్సికో ప్రజలు మాత్రం మనలా కాదు. ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే వాళ్ల తడాఖా చూపిస్తున్నారు.

మన నాయకుల్లాంటి నాయకుడే మెక్సికోలోని చిచిక్విలా మేయర్‌ అల్ఫాన్సో హెర్నాండేజ్‌ మోనిటియల్‌. ఎన్నికల్లో ఎన్నో హామీలిచ్చి.. తీరా గెలిచి మొత్తం మర్చిపోయాడు. జనాలు కూడా హామీలు నెరవేరుస్తాడెమోనని చూసి.. చూసి.. విసుగుచెందారు. మేయర్‌ పదవీకాలం మరో 5 నెలలు మాత్రమే ఉంది. ఇంక హామీలు నెరువేరుస్తాడని చూడలేక.. ఓ ఆదివారం నేరుగా మేయర్‌ ఉంటున్న టౌన్‌ హాల్‌కి పోయి నిరసన వ్యక్తం చేశారు.

అంతటితో ఆగకుండా మేయర్‌తోపాటు అతని సిబ్బందిని టౌన్‌ హాల్‌లోనే నిర్బంధించారు. హామీలు తీరుస్తావా.. లేకుంటే ఇలానే బందీగా ఉంటవా..? నీ ఇష్టం తేల్చుకో అని అల్టిమేటం జారీ చేశారు. వాళ్ల కరెన్సీలో 10 మిలియన్ల పేసోలు విడుదల చేయాల్సిందిగా డిమాండ్‌ చేశారు. ఇక మేయర్‌గారు చేసేదేమీలేక కాళ్ల బేరానికి వచ్చి.. బాబ్బాబూ ప్రస్తుతానికి ఓ 3 మిలియన్ల పేసోలు తీసుకుని నన్ను వదిలేయండని ప్రాధేయపడి అక్కడ నుంచి బయటపడ్డాడు.  

మరిన్ని వార్తలు