చివరి దాకా బీఫారం కోసం కొట్లాడతా

30 Oct, 2023 07:28 IST|Sakshi

హైదరాబాద్: బీఫారం కోసం చివరి వరకు అధిష్టానంతో కొట్లాడతానని, కార్యకర్తలెవరూ అధైర్యపడొద్దని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, బడంగ్‌పేట మేయర్‌ చిగురింత పారిజాత అన్నారు. కార్పొరేషన్‌ పరిధిలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో ఆదివారం జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. నియోజకవర్గంలోని గడపగడపకూ తిరిగి పార్టీని బలోపేతం చేశానని చెప్పారు. పార్టీ నిర్ణయం తనను, కార్యకర్తలను ఎంతో బాధించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలోని హైకమాండ్‌ వద్ద తన పేరు ఖరారైనప్పటికీ మన బలం చూసి ఇతరులు భయపడి టికెట్‌ రాకుండా కుట్రలు చేశారని ఆరోపించారు.

చివరివరకు అధిష్టానం తనను గుర్తించి న్యాయం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పార్టీని వ్యక్తులు మోసం చేశారు తప్ప పార్టీ ఎప్పుడు మోసం చేయలేదన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీకి కానుకగా రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. 20 ఏళ్ల నుంచి ప్రజాక్షేత్రంలోనే ఉన్నానని, కాంగ్రెస్‌ పార్టీ కన్న తల్లిలాంటిదని, కట్టె కాలే వరకు కాంగ్రెస్‌లోనే ఉంటానని పారిజాత స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు