అమెరికాపై సైక్లోన్‌ ‘బాంబ్‌’

6 Jan, 2018 01:24 IST|Sakshi
పూర్తిగా జలమయమైన బోస్టన్‌లోని బీచ్‌ రోడ్డు వెంట కష్టంగా వెళ్తున్న వాహనాలు

డజను మందికి పైగా మృతి!

ఉత్తర, దక్షిణ కరోలినా, న్యూయార్క్‌లపై ప్రభావం

న్యూయార్క్‌: అమెరికాపై మరో తుపాను విరుచుకుపడింది. ఆ దేశ తూర్పు తీరాన్ని తాకిన ‘బాంబ్‌ సైక్లోన్‌’ ధాటికి ఇప్పటి వరకు డజను మందికి పైగా చనిపోయినట్లు భావిస్తున్నారు. ఉత్తర కరోలినాలో ట్రక్కు ఓ బ్రిడ్జిపై నుంచి జారి ఓ కొండపై పడిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు మృతిచెందినట్లు తెలిసింది. ఉత్తర, దక్షిణ కరోలినా, బోస్టన్, ఉత్తర ఫ్లోరిడా, న్యూయార్క్, వాషింగ్టన్, వర్జీనియాల్లో తుపాను ప్రభావం అధికంగా ఉంది. చాలా ప్రాంతాల్లో మంచు తుపాను లాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయి.

ఈదురు గాలులు, భారీ వర్షాలకు తోడు ఉష్ణోగ్రతలు మైనస్‌ స్థాయికి పడిపోవడంతో మంచుతో కప్పి ఉన్న రోడ్లపై ప్రయాణం కష్టమవుతోంది. అత్యల్ప ఉష్ణోగ్రతలు, శీతల పవనాలు ఈ వారమంతా కొనసాగే అవకాశాలున్నట్లు అమెరికా జాతీయ వాతావరణ సంస్థ వెల్లడించింది. వీధుల వెంట మంచు పేరుకుపోవడంతో స్కూళ్లను మూసివేయడంతో పాటు పలు విమాన సర్వీసులను రద్దుచేశారు. న్యూయార్క్‌లోని రెండు ప్రధాన రన్‌వేలను మూసివేశారు. నయాగరా జలపాతం దాదాపుగా గడ్డకట్టుకుపోయింది.  

న్యూయార్క్‌లో అత్యవసర పరిస్థితి...
తుపాను ప్రభావం విద్యుత్, టెలీ కమ్యూనికేషన్లపై కూడా పడింది. వర్జీనియా, ఉత్తర కరోలినాలో ప్రజలకు విద్యుత్‌ ఇక్కట్లు తప్పలేదు. బోస్టన్‌ తీరంలో వరదల పరిస్థితిని మసాచుసెట్స్‌ గవర్నర్‌ చార్లి బేకర్‌ తీవ్రమైనదిగా పేర్కొన్నారు. న్యూయార్క్‌లో ఇప్పటికే అత్యవసర పరిస్థితిని ప్రకటించి, 500 మంది సిబ్బందితో సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ఉత్తర ఫ్లోరిడా, సౌత్‌ ఈస్టర్న్‌ జార్జియాలోనూ పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. రాబోయే రోజుల్లో న్యూయార్క్, బోస్టన్‌లలో అడుగు కన్నా ఎక్కువ ఎత్తులో మంచు పేరుకుపోవొచ్చని అంచనా వేస్తున్నారు. లాంగ్‌ ఐలాండ్, సౌత్‌ ఈస్టర్న్‌ కనెక్టికట్‌లలో గంటకు 88.5 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశాలున్నట్లు భావిస్తున్నారు. దీంతో ఇక్కడ ఉష్ణోగ్రతలు మైనస్‌ 29 డిగ్రీలకు పడిపోయే అవకాశముంది. వర్జీనియా తీరం వెంట వాషింగ్టన్, న్యూపోర్ట్‌ న్యూస్‌ల మధ్య రైలు సేవలను నిలిపివేశారు.

బాంబ్‌ సైక్లోన్‌ అంటే..  
ఇలాంటి తుపాన్ల సాంకేతిక నామం బాంబోజెనెసిస్‌ కాగా, సాధారణంగా ‘బాంబ్‌ సైక్లోన్‌’ అని పిలుస్తారు. వాతావరణ పీడనం ఒక్కరోజు వ్యవధిలోనే కనీసం 24 మిల్లీబార్లకు పడిపోయి హరికేన్‌ లాంటి పెను గాలులకు దారితీసే వాతావరణ మార్పులనే బాంబోజెనెసిస్‌గా పరిగణిస్తారు.  

                     ఉపగ్రహ ఛాయాచిత్రం

మరిన్ని వార్తలు