నేను భారతీయురాలినైతేనా..? నితీష్ వ్యాఖ్యలపై అమెరికా సింగర్ ఫైర్

9 Nov, 2023 10:59 IST|Sakshi

వాషింగ్టన్: మహిళలపై బిహార్ సీఎం నితీష్ కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలను అమెరికా గాయని, నటి మేరీ మిల్‌బెన్ ఖండించారు. నితీష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తాను భారతీయురాలినైతే బిహార్‌కు వెళ్లి సీఎం పదవికి పోటీ చేసేదాన్నని అన్నారు. బిహార్ సీఎంగా పోటీ చేయడానికి ఓ ధైర్యవంతురాలైన మహిళ అవసరమని అభిప్రాయపడ్డారు.  

"బిహార్‌లో మహిళల విలువలు ప్రమాదంలో ఉన్నాయి. నితీష్ కుమార్ వ్యాఖ్యలు విన్న తర్వాత ఈ సవాళ్లకు ఒకే ఒక సమాధానం కనిపిస్తోంది. బిహార్‌లో సీఎం పదవికి ఓ ధైర్యవంతురాలైన మహిళ పోటీ చేయాల్సిన అవసరం ఉంది. నేనే భారతీయురాలినైతే బిహార్‌కు వెళ్లి సీఎం పదవికి పోటీ చేస్తా' అని మేరీ మిల్‌బెన్ అన్నారు.

భారతీయులు మహిళల కోసం ఓటు వేయాలని కోరారు. మార్పును ఆహ్వానించాలని ఆకాంక్షించారు. బిహార్‌లో మహిళల అధికారం దిశగా బీజేపీ అడుగులు వేయాలని కోరారు. ఇదే నిజమైన అభివృద్ధని అభిప్రాయపడ్డారు. ప్రధాని మోదీ సారథ్యంలో మహిళా సాధికారత సాధ్యమవుతుందని చెప్పారు.  

స్త్రీలు చదువుకుంటే.. భర్తలను కంట్రోల్‌లో పెట్టి జనాభాను తగ్గిస్తారని జనాభా నియంత్రణపై మాట్లాడిన నితీష్ కుమార్ వ్యాఖ్యలు దుమారం రేపాయి.  మహిళలు విద్యావంతులైతే కలయిక వేళ భర్తలను అదుపులో పెడతారని, తద్వారా జనాభా తగ్గుతుందని బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్ వ్యాఖ్యానించారు. మహిళలు విద్యావంతులు అవుతున్నందువల్లే ఒకప్పుడు 4.3గా ఉన్న జననాల రేటు ప్రస్తుతం 2.9కు తగ్గిందని, త్వరలోనే 2కు చేరుతుందని నితీశ్‌ అసెంబ్లీలో  అన్నారు.  

ఇదీ చదవండి: జనాభా నియంత్రణపై వివాదాస్పద వ్యాఖ్యలు.. సీఎం నితీష్ కుమార్ క్షమాపణలు

మరిన్ని వార్తలు