బురఖా వేసుకుంటే.. జాబ్ పోయింది!

8 Aug, 2016 09:35 IST|Sakshi
బురఖా వేసుకుంటే.. జాబ్ పోయింది!

వాషింగ్టన్: 'అల్లా' అన్నందుకు ఓ ముస్లిం జంటను విమానం నుంచి గెంటేసిన ఉదంతం మరువక ముందే.. తన మత సాంప్రదాయం ప్రకారం బురఖా వేసుకున్న ఓ ముస్లిం మహిళను ఉద్యోగం నుంచి తొలగించారు. అమెరికాలోని వర్జీనియాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ డెంటల్ క్లినిక్లో అసిస్టెంట్గా చేరిన మహిళను కేవలం బురఖా ధరించిందన్న కారణంతో ఓ డాక్టర్ పనిలోనుంచి తొలగించాడు.

ఫెయిర్ఫాక్స్ కౌంటీలోని ఓక్స్ డెంటల్ కేర్లో నజఫ్ ఖాన్ అనే మహిళ డాక్టర్ చుంక్ జూ వద్ద డెంటల్ అసిస్టెంట్గా పనిలో చేరింది. ఇంటర్వ్యూ సమయంలో, పనిలో చేరిన రెండు రోజుల వరకు మామూలు దుస్తుల్లో వెళ్లిన నజఫ్.. అనంతరం బురఖా ధరించింది. అంతే.. ఇది నచ్చని డాక్టర్ చుంక్ జూ.. ఆమెకు బురఖా ధరిస్తే పని మానుకోవాలని చెప్పాడు. అంతగా కావాలంటే స్కార్ఫ్ వేసుకొమ్మని సలహా కూడా ఇచ్చాడు. దీంతో తన మత సాంప్రదాయాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని చెప్పిన నజఫ్ జాబ్ను వదులుకున్నట్లు మీడియాతో చెప్పింది. తమ మత నియమాలను పాటిస్తున్నందుకు ఏ వ్యక్తీ ఉద్యోగం కోల్పోకూడదని నజఫ్ ఉద్వేగంగా మాట్లాడింది.
 

మరిన్ని వార్తలు