నిర్మాతలుగా ఒబామా దంపతులు

23 May, 2018 18:45 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా, ఆయన సతీమణి మిషెల్‌ ఒబామా ‘నెట్‌ఫ్లిక్స్‌’తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ మేరకు వారు సినిమాలు, డాక్యుమెంటరీలు, ఫీచర్స్‌ నిర్మించి నెట్‌ఫ్లిక్స్‌ ద్వారా ప్రసారం చేయనున్నారు. ఒబామా దంపతులు నిర్మించే డాక్యుమెంటరీల్లో ముందస్తు స్క్రిప్టు రాసుకున్నవి, స్క్రిప్టు అవసరంలేని డాక్యుమెంటరీలు ఉంటాయని నెట్‌ఫ్లిక్స్‌ యాజమాన్యం ప్రకటించింది. ఒబామా తాను అధ్యక్షుడిగా ఉన్న ఎనిమిదేళ్ల అనుభవాలను కూడా నెట్‌ఫ్లిక్స్‌ ద్వారా అంతర్జాతీయ ప్రేక్షకులతో పంచుకోనున్నారు. నెట్‌ఫ్లిక్స్‌తో ఒబామా దంపతులకు త్వరలోనే ఓ ఒప్పందం కుదరబోతోందని ‘న్యూయార్క్‌ టైమ్స్‌’ పత్రిక గత మార్చి నెలలోనే ప్రకటించింది.

నెట్‌ఫ్లిక్స్‌ కోసం ఒబామా దంపతులు ‘హయ్యర్‌ గ్రౌండ్‌ ప్రొడక్షన్స్‌’ పేరిట ఓ నిర్మాణ సంస్థను కూడా ఏర్పాటు చేశారు. తమ నిర్మాణ సంస్థ ద్వారా ప్రపంచంలోని వివిధ వర్గాల ప్రజలతో ముచ్చటించబోతున్నామని, వారి విలువైన అభిప్రాయలను, అభిరుచులను తెలుసుకోవడంతోపాటు వాటిని ప్రపంచ ప్రజలతో పంచుకునేలా చేయడం కోసమే తాము ఈ నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసినట్లు ఒబామా ఓ ప్రకటనలో తెలిపారు. వివిధ వర్గాల ప్రజల్లో నిగూఢంగా దాగున్న నైపుణ్యాన్ని, సృజనాత్మక శక్తిని కూడా వెలికితీసి ప్రోత్సహించేందుకు తాము కృషి చేస్తామని చెప్పారు.

మరిన్ని వార్తలు