Boeing 787 Viral Video: అంటార్కిటికాలో దిగిన అతిపెద్ద విమానం

18 Nov, 2023 13:19 IST|Sakshi

నార్స్ అట్లాంటిక్ ఎయిర్‌వేస్‌ అరుదైన ఘనత సాధించింది. అతి పెద్ద ప్యాసింజర్ విమానం బోయింగ్ 787ను అంటార్కిటికాలోని "బ్లూ ఐస్ రన్‌వే"పై సురక్షితంగా ల్యాండ్ చేసింది. నార్స్ అట్లాంటిక్ ఎయిర్‌వేస్‌కు చెందిన ఈ విమానం అంటార్కిటికాలోని ట్రోల్ ఎయిర్‌ఫీల్డ్‌లో దిగింది. 330 మంది ప్రయాణీకులను తీసుకెళ్లగల భారీ ఎయిర్‌క్రాఫ్ట్ అంటార్కిటికా ఖండానికి చేరుకోవడం ఇదే మొదటిసారి.

 "నార్స్‌కి ఇది ఒక చారిత్రాత్మక క్షణం. అంటార్కిటికాలో ల్యాండ్ అయిన మొట్టమొదటి బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్. ఈ ఘనతతో నార్స్‌ ఓ మైలురాయిని చేరింది. ఇందుకు మేము గర్వంగా భావిస్తున్నాము" అని ఎయిర్‌లైన్స్ సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొంది. "ట్రోల్ ఎయిర్‌ఫీల్డ్‌లో దిగిన అతిపెద్ద విమానం. దీంతో ఒకేసారి ఎక్కువ మందిని అంటార్కిటికాకు తీసుకెళ్లగలమని భావిస్తున్నాం.' అని డైరెక్టర్ కెమిల్లా బ్రెక్కే చెప్పారు. ల్యాండింగ్‌కు సంబంధించిన  వీడియోను జత చేస్తూ నార్వేజియన్ పోలార్ ఇన్స్టిట్యూట్ ట్వీట్ చేసింది.

అంటార్కిటికాలోని క్వీన్ మౌడ్ ల్యాండ్‌లోని రిమోట్ ట్రోల్ రీసెర్చ్ స్టేషన్‌కు అవసరమైన పరిశోధన పరికరాలు,  శాస్త్రవేత్తలను తీసుకెళ్లడం ఎయిర్‌లైన్ డ్రీమ్‌లైనర్ లక్ష్యం. అంటార్కిటిక్ అన్వేషణకు అవసరమైన 12 టన్నుల పరిశోధన పరికరాలను విమానంలో తీసుకెళ్లారు. నార్వేజియన్ పోలార్ ఇన్‌స్టిట్యూట్ శాస్త్రవేత్తలతో సహా మొత్తం 45 మంది ప్రయాణికులు విమానంలో ఉన్నారు. పూర్తిగా మంచుతో కప్పబడి ఉండే అంటార్కిటికా ఖండంలో విమానం ల్యాండ్ చేయడం సవాలుతో కూడి ఉంటుంది. 

ఇదీ చదవండి: దక్షిణ గాజాను వీడండి.. పాలస్తీనాకు ఇజ్రాయెల్ హెచ్చరికలు


 

మరిన్ని వార్తలు