పాస్ పోర్టుకు అప్లై చేస్తే కళ్లు చిన్నగా ఉన్నాయని..

12 Dec, 2016 14:32 IST|Sakshi
పాస్ పోర్టుకు అప్లై చేస్తే కళ్లు చిన్నగా ఉన్నాయని..

ఆన్లైన్లో ఏదైనా అప్లికేషన్ను అప్లోడ్ చేసినప్పుడు టెక్నికల్ సమస్య గానీ లేక ఇమేజ్ సైజ్ సమస్యగానీ మనం సర్వసాధారణంగా చూస్తూనే ఉంటాం. అయితే న్యూజిలాండ్లో రిచర్డ్ లీ అనే యువకుడు పాస్ పోర్టు కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేస్తుంటే అతను అప్లోడ్ చేసిన ఇమేజ్ని సిస్టమ్ రిజక్ట్ చేసింది. అంతేనా ఎందుకు రిజక్ట్ చేసిందో ఓ కంప్యూటర్ జనరేటెడ్ ఎర్రర్ మెసేజ్ను కూడా పంపింది. దాన్ని చూసి లీ ఒక్కసారిగా అవాక్కయ్యాడు.

అందులో ఏముందంటే..' ఆన్లైన్ దరఖాస్తు ఫాంలో మీరు అప్లోడ్ చేయాలనుకుంటున్న ఫోటో మా నిబంధనలకు విరుద్దంగా ఉంది. అందులో మీరు కళ్లు మూసుకొని ఉన్నారు' అంటూ ఎర్రర్ మెసేజ్ వచ్చింది. అయితే లీ ఆసియా సంతతకి చెందినవాడు కావడంతో కళ్లు సాధారణంగానే కొంచెం చిన్నవిగా ఉన్నాయి. ఆ ఫోటోలో లీ కళ్లు తెరిచి ఉన్నట్టు స్పష్టంగానే కనిపిస్తుంది.

'కంప్యూటర్ మెసేజ్ చూడటంతోనే నవ్వుతూ చైర్లో నుంచి కిందపడిపోయా. నాకు తెలుసు నా కళ్లు కొద్దిగా చిన్నవిగా ఉంటాయని. దాని వల్ల నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ, ఓ కంప్యూటర్ నా కళ్లు మూసుకొని ఉన్నాయని ఎర్రర్ మెసేజ్ ఇవ్వడం ఆశ్చర్యాన్ని కలిగించింది' అని లీ పేర్కొన్నారు.

ఎర్రర్ మెసేజ్ రావడంతో లీ తిరిగి మరో మూడుసార్లు ప్రయత్నించాడు. కానీ, మళ్లీ అదే మెసేజ్ రావడంతో సహాయం కోసం పాస్ పోర్టు అధికారులను ఫోన్ ద్వారా సంప్రదించాడు. తన కళ్లలో షాడో ఉండటం, ఫేస్ పై లైటింగ్ ఎఫెక్ట్ సరిగ్గా లేకపోవడంతో కంప్యూటర్కు ఆ ఫోటోను ప్రాసెస్ చేయడం కష్టతరమైందని వారు బదులిచ్చారని లీ తెలిపారు.

కంప్యూటర్(సిస్టమ్) పక్షపాతంగా వ్యవహరించిదన్న వ్యాఖ్యలను న్యూజిలాండ్ ఇంటర్నల్ అఫైర్స్ అధికార ప్రతినిధి స్టీవ్ కార్బెట్ తోసిపుచ్చారు. నిర్ధిష్ట వ్యక్తులను లక్ష్యంగా చేసుకొని నిబంధనలు పెట్టలేదని పేర్కొన్నారు. ఆన్లైన్లో అప్లోడ్ చేసిన వాటిలో 20 శాతం ఫోటోలు వివిధ కారణాలతో తిరస్కరణకు గురవుతున్నాయని గుర్తుచేశారు. వీటిలో ఎక్కువ భాగం మొహం పై షాడో పడటం ఒక కారణమని, అయితే దీన్ని కంప్యూటర్ కళ్లు మూసి ఉన్నాయనుకొని భావించి ఎర్రర్ మెసేజ్ ఇస్తున్నట్టు తెలిపారు. ఈ వ్యవహారంలో లీ మరో ఫోటో అప్లోడ్ చేస్తే కంప్యూటర్ యాక్సెప్ట్ చేసిందని, అదే రోజు పాస్ పోర్టు కూడా జారీ చేసినట్టు స్టీవ్ కార్బెట్ చెప్పారు.    

ఆటోమేటెడ్ కంప్యూటర్లతో ఇలాంటి సమస్యలు తలెత్తడం ఇదే మొదటి సారి కాదు. తెల్లరంగులో ఉన్న వారు కాకుండా మిగతా వారు ఇలాంటి సమస్యలు ఇంతకు ముందు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. హెచ్పీ వెబ్ క్యామ్లు వాడకంలోకి వచ్చిన తొలినాళ్లలో.. నల్లరంగులో ఉన్న వారు ఫోటో దిగే సమయంలో ఫేస్ను డిటెక్ట్ చేయలేక పోతున్నామనే మెసేజ్ వచ్చేది.  

మరిన్ని వార్తలు