భారత్‌ దారుణంగా అణచివేస్తోంది

3 Apr, 2018 16:48 IST|Sakshi

ఇస్లామాబాద్‌ : కశ్మీర్‌ వ్యవహారంలో పాకిస్థాన్‌ మరోసారి తన అక్కసు వెల్లగక్కింది. భారత్‌ దారుణంగా అణచివేత చర్యలకు పాల్పడుతోందని ఆరోపణలు గుప్పించింది. పాక్‌ ప్రధాని షాహిద్‌ ఖక్కన్‌ అబ్బాసీ స్వయంగా ఆ ఆరోపణలకు దిగటం విశేషం.

‘కశ్మీరు ప్రజలతో భారత సైన్యం దారుణంగా వ్యవహరిస్తోంది. వారిని మనశ్శాంతిగా ఉండనివ్వటం లేదు. అమాయకుల ప్రాణాలు బలి తీసుకుంటోంది. ధర్నాలు, ఆందోళన చేపట్టే వారిపై పెల్లెట్‌ గన్‌లను ప్రయోగిస్తూ అణచివేత ధోరణిని ప్రదర్శిస్తోంది. స్వేచ్ఛ కోసం పోరాడే వారిని ఉగ్రవాదులుగా ముద్ర వేస్తోంది’ అని పేర్కొంటూ అబ్బాసీ ఓ ప్రకటన విడుదల చేశారు. కాగా, అంతర్జాతీయ సమాజం ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని.. నిజనిర్ధారణ కమిటీ ద్వారా కశ్మీర్‌లోని పరిస్థితులపై అధ్యయనం చేపట్టాలని ఐకరాజ్యసమితిని కోరారు.

కాగా, ఆదివారం వరుస ఎన్‌కౌంటర్లలో 13 మంది మిలిటెంట్లు హతమయ్యారు. తీవ్రవాదుల్ని భద్రతా బలగాలు మట్టుబెట్టాయనే విషయం తెలియడంతో దక్షిణ కశ్మీర్‌లో ఘర్షణలు ప్రారంభమయ్యాయి. పోలీసులపైకి నిరసనకారులు రాళ్లు రువ్వడంతో ప్రతిగా బలగాలు వారిపైకి కాల్పులకు దిగాయి. ఈ కాల్పుల్లో నలుగురు పౌరులు మృతి చెందగా, పలువురు గాయపడినట్లు కశ్మీర్‌ డీజీపీ వాయిద్‌ ప్రకటించారు. ఈ పరిణామాల అనంతరం అబ్బాసీ ప్రకటన వెలువడటం గమనార్హం.

మరిన్ని వార్తలు