ఈ అభ్యర్థి ఆస్తులు రూ.22,300 కోట్లు!

24 Jun, 2018 16:21 IST|Sakshi
మహ్మద్‌ హుస్సేన్‌ షేక్‌

ఇస్లామాబాద్‌: త్వరలో జరగనున్న పాకిస్తాన్‌ సార్వత్రిక ఎన్నికల్లో కళ్లు చెదిరే ఆస్తులున్న అభ్యర్థి బరిలోకి దిగాడు. నామినేషన్‌ వేసిన సందర్భంగా ఎన్నికల కమిషన్‌కు అతడు తెలిపిన తన ఆస్తుల విలువ రూ. 223 బిలియన్లు (రూ. 22,300 కోట్లు). ​కాగా ఈ ఎన్నికల్లో అతడు స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేయడం గమనార్హం.

వివరాల్లోకి వెళితే.. ముజఫర్‌గడ్‌ జిల్లాలోని ఎన్‌ఏ-182, పీపీ-270 నియోజక వర్గాల నుంచి మహ్మద్‌ హుస్సేన్‌ షేక్‌ పోటీ చేస్తున్నారు. నామినేషన్‌ వేసిన సందర్భంగా ఎన్నికల అఫిడవిట్‌ తన ఆస్తుల విలువ దాదాపు 22,300 కోట్ల రూపాయలుగా ఆయన ప్రకటించారు. ఇందులో 40శాతం మేరకు భూమి విలువ(స్థిరాస్తి)గా చూపించారు.

మరోవిషయం ఏమిటంటే ముజఫర్‌గడ్‌లోని హుస్సేన్‌ భూముల వివాదం కేసు గత 88 ఏళ్లుగా సుప్రీం కోర్టులో  కొనసాగుతోంది. ఇటీవల పాకిస్తాన్‌ సుప్రీంకోర్టు హుస్సేన్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది. దీంతో ఆయన ఆస్తుల విలువ ఒక్కసారిగా రూ.22,300 కోట్లకు పెరిగింది. ఈ ఏడాది జరిగే ఎన్నికల్లో అత్యంత సంపన్న అభ్యర్థిగా హుస్సేన్‌ నిలిచారు. మాజీ విదేశాంగ మంత్రి హినా రబ్బానీ ఖర్, ఇతర నేతలు కూడా ఆ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. జులై 25న పాకిస్తాన్‌లో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి.

మరిన్ని వార్తలు