మా అమ్మ డయానా కోసం 20 ఏళ్లుగా..

17 Apr, 2017 12:30 IST|Sakshi
మా అమ్మ డయానా కోసం 20 ఏళ్లుగా..

లండన్‌: ఏదేశంలో ఉన్నా అమ్మ అమ్మే అని మరోసారి రుజువైంది. కొండంత డబ్బు, లెక్కలేనంత బంగారం, కాలు కిందపెట్టనీయని మంది మార్బలం ఉన్నా అమ్మలేని లోటు ముందు అవన్నీ దిగదుడుపే. ఈ విషయాన్ని స్వయంగా బ్రిటన్‌ యువరాజు హ్యారీ తెలిపాడు. తన తల్లి ప్రిన్సెస్‌ డయానా లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిదని అన్నారు. ప్రస్తుతం 32 ఏళ్ల వయసులో ఉన్న యువరాజు హ్యారీ 12 ఏళ్ల వయసులోనే 1997లో తన తల్లి డయానాను కోల్పోయాడు. అప్పటి నుంచి అతడు నరకం అనుభవించాడట. వేలసార్లు తనలో తానే కుమిలిపోయేవాడని ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు.

ప్రతి క్షణం తన తల్లి డయానా గుర్తొచ్చేదని, వెంటనే ఎంతో ఎమోషనల్‌ అవుతుండేవాడినని కాల క్రమంలో అందులో నుంచి బయటపడేందుకు శత విధాల ప్రయత్నించినట్లు వివరించాడు. ఇంకెప్పుడు తన తల్లి గురించి ఆలోచించకూడదని బలంగా అనుకునేవాడినని, ఎందుకంటే ఆ ఆలోచన తనను మరింత కుంగదీస్తున్నందున ఆమె జ్ఞాపకాలకు దూరంగా ఉండాలని భావించే వాడినని పేర్కొన్నారు. ఒక్కసారి అసలు తనకు ఏమవుతుందని భయంతో 28 ఏళ్ల సమయంలో కూడా మానసిక నిపుణులతో తర్ఫీదు తీసుకున్నట్లు వివరించారు.

తన సోదరుడు ప్రిన్స్‌ విలియం నుంచి కూడా ఎంతో మద్దతులభించేదని, తన బాధ ఎప్పటికీ తన తల్లిని తీసుకురాలేదని క్రమంగా అర్థం చేసుకునేవాడినని, ఇప్పటికీ తానొక ఎమోషనల్‌ పర్సన్‌ను అని చెప్పేశారు. వాస్తవానికి మీడియా హ్యారీ ఎప్పుడూ దూరంగా ఉంటాడు. అతడికి మీడియాతో వ్యవహరించడం పెద్దగా అనుభవం కూడా లేదు. అతడి వ్యక్తిగత విషయాలను ఏనాడు వివరించలేదు. ఇంత ఓపెన్‌గా మాట్లాడటం ఇదే తొలిసారి. ఓ కారు ప్రమాదంలో డయానా ఆగస్టు 31, 1997లో కన్నుమూసిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు