గుర్రాల ముఖ కవళికలూ మనలాగేనట!

8 Aug, 2015 07:21 IST|Sakshi
గుర్రాల ముఖ కవళికలూ మనలాగేనట!

లండన్: మానవులు వివిధ సందర్భాల్లో పలు రకాల ముఖ కవళికల్ని ప్రదర్శిస్తుంటారు. కోపం, ఆశ్చర్యం, బాధ.. ఇలా అనేక భావోద్వేగాలకు వేర్వేరు ముఖ కవళికలు మానవుల్లో చూస్తుంటాం. చింపాంజీలు కూడా మానవులను పోలిన ముఖ కవళికల్ని ప్రదర్శిస్తాయి. ఇప్పుడు మానువులు, చింపాంజీలలాగే గుర్రాలు కూడా మనలాంటి ముఖ కవళికల్నే ప్రదర్శిస్తాయని తాజా అధ్యయనంలో తేలింది. గుర్రాల్లో 17 విలక్షణ ముఖ కవళికల్ని యూనివర్సిటీ ఆఫ్ సస్సెక్స్ పరిశోధకులు గుర్తించారు. ముక్కు, పెదాలు, కళ్లు తదితర భాగాల్ని కదిలించడం ద్వారా అవి తమ భావోద్వేగాల్ని ప్రదర్శిస్తాయి. ఇలా చేయడం వల్ల అనేక జీవులు సమాచారాన్ని పంచుకోవడం కోసం ముఖాన్ని ఎలా వినియోగిస్తాయో తెలిసిందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు.

ద ఈక్వైన్ ఫేసియల్ యాక్షన్ కోడింగ్ సిస్టమ్ (ఈక్వీఎఫ్‌ఏసీఎస్) విధానం ద్వారా గుర్రాల ముఖ కవళికల్ని వారు అధ్యయనం చేశారు. మానవుల్లోని 27, చింపాంజీల్లోని 13, కుక్కల్లోని 16 కవళికల్తో వాటిని పోల్చి చూశారు. గుర్రాల కంటి చూపు కుక్కలు, పిల్లులకంటే  స్పష్టంగా ఉంటుంది. పైగా గుర్రాల భావోద్వేగాల్ని గుర్తించడం కూడా చాలా సులభం. మానవులు, గుర్రాల ముఖాల నిర్మాణంలో తేడాలున్నప్పటికీ కొన్ని సమాన పోలికల్ని గుర్తించగలిగామని పరిశోధకులు తెలిపారు.

మరిన్ని వార్తలు