తొలిసారి అంటార్కిటిక్‌ త్వైట్స్‌ చిత్రాలు

3 Feb, 2020 04:43 IST|Sakshi

న్యూయార్క్‌: సముద్రాల నీటి మట్టం పెరగడానికి ముఖ్యకారణమైన అంటార్కిటిక్‌ ఖండంలోని త్వైట్స్‌ అనే మంచు కొండకు సంబంధించిన చిత్రాలను శాస్త్రవేత్తలు తొలిసారి బంధించారు. అమెరికాలోని జార్జియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ పరిశోధకులు రోబోటిక్‌ సబ్‌మెరైన్‌ సాయంతో చిత్రాలను తీశారు. వీటి సాయంతో త్వైట్స్‌ కదలికలను క్షుణ్నంగా పరిశీలించే అవకాశం లభించనుంది. త్వైట్స్‌ కారణంగా భూమిపై సముద్రాల నీటి మట్టం 4 శాతం మేర పెరుగుతుంది. దీని కదలికల్లో చోటుచేసుకునే చిన్న పరిణామాల వల్ల కూడా సముద్ర నీటి మట్టాలు 25 అంగుళాల మేర పెరిగే అవకాశం ఉంది. గత 30 ఏళ్లలో త్వైట్స్‌ నుంచి సముద్రాల్లోకి ప్రవహించే మంచు శాతం రెట్టింపైనట్టు పరిశోధకులు వెల్లడించారు. ఇప్పటికే సముద్రాల్లోకి చేరుతున్న గ్రీన్‌ల్యాండ్‌లోని మంచు అత్యంత ప్రమాదకర స్థాయిల్లోకి వెళ్లిందని, తాజాగా అంటార్కిటికాలోని మంచు కూడా ఇప్పుడిప్పుడే సముద్రాల్లోకి చేరుతోందని తెలిపారు. భూమిపై అతిపెద్ద మంచు పలకం అయిన దీని వల్ల రానున్న వందేళ్లలో సముద్రాల నీటి మట్టాలు పెరగడానికి ప్రధాన కారణమయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు