అమెరికాలో కాల్పులు: ఏడుగురి మృతి

26 Feb, 2016 09:33 IST|Sakshi
అమెరికాలో కాల్పులు: ఏడుగురి మృతి

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా కాల్పుల ఘటనతో మరోసారి ఉలిక్కిపడింది. అమెరికాలోని కన్సాస్ రాష్ట్రంలో తాను పనిచేస్తున్న ఫ్యాక్టరీలోనే ఓ పెయింటర్ కాల్పులు జరపడంతో ఏడుగురు మరణించారు. దాదాపు 30 మంది వరకు గాయపడ్డారు. సెడ్రిక్ ఫోర్డ్ ఎక్సెల్ ఇండస్ట్రీస్‌లో పెయింటర్‌గా పనిచేస్తాడు. అతడు ఫేస్‌బుక్‌లో అసాల్ట్ రైఫిల్‌తో ఉన్న తన ఫొటోను పోస్ట్ చేశాడని స్థానికులు తెలిపారు.

అతడు ముందుగా తన కంపెనీ పార్కింగ్ లాట్‌లో ఓ మహిళను కాల్చాడు. తర్వాత అసెంబ్లీ ఏరియాలోకి ప్రవేశించి, విచక్షణారహితంగా కాల్పులు ప్రారంభించాడు. అయితే, మరో ఇద్దరిని మాత్రం ఇంకా ఫ్యాక్టరీలోకి రాకముందే కాల్చాడని హార్వే కౌంటీ ఆఫీస్ సూపర్ వైజర్ షెరీఫ్ వాల్టన్ స్థానిక మీడియాకు వెల్లడించారు. తర్వాత ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు జరిపిన కాల్పుల్లో సెడ్రిక్ ఫోర్డ్ కూడా మరణించాడు. విషయం తెలియగానే ఫ్యాక్టరీలో పనిచేసేవాళ్ల బంధువులు అక్కడకు తరలి వెళ్లారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. తన మేనల్లుడిని వీపులో నాలుగుసార్లు కాల్చాడని ఓ వ్యక్తి చెప్పారు. సెడ్రిక్ వద్ద ఒక ఏకే 47 తుపాకితో పాటు 9ఎంఎం గన్ కూడా ఉందని అంటున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని వార్తలు