బడ్జెట్‌లో వాజ్‌పేయి కవితలు

26 Feb, 2016 05:34 IST|Sakshi

రైల్వే బడ్జెట్ సైడ్‌లైట్స్
 
న్యూఢిల్లీ: రైల్వే మంత్రి సురేశ్‌ప్రభు తన రెండో రైల్వే బడ్జెట్ సమర్పణ సందర్భంగా మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి, హరివంశ్‌రాయ్ బచ్చన్ కవితలు మొదలుకొని గౌతం బుద్ధుడి సూక్తులను ప్రస్తావించారు.సురేశ్‌ప్రభు సతీమణి ఉమ, కుమారుడు అమయలు సందర్శకుల గ్యాలరీలో కూర్చొని బడ్జెట్ ప్రసంగాన్ని వీక్షించారు.గంటకుపైగా సాగిన బడ్జెట్ ప్రసంగం సందర్భంగా ప్రధాని మోదీతోపాటు అధికార పార్టీ సభ్యులు పదేపదే బల్లలను చరిచి రైల్వేమంత్రిని అభినందించారు.జిల్లాల్లో చేపట్టిన రైల్వే ప్రాజెక్టుల్లో ఉపాధి కల్పన అవకాశాల గురించి, ఎంపిక చేసిన రైల్వేస్టేషన్లలో వికలాంగులకు టాయిలెట్లు ఏర్పాటుచేస్తామని సురేశ్ చెబుతుండగా మోదీ చప్పట్లు కొడుతూ కనిపించారు.ఉదయం 11.50 గంటలకు సభలోకి వచ్చిన ప్రభు.. 12.05 గంటలకు రైల్వేమంత్రిగా తన అనుభవాలతో మొదలుపెట్టి బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు.

‘నూతన ఆదాయం, నూతన విధానం, నూతన నిర్మాణం’ అనే మూడు స్తంభాలపై రైల్వే ఆధారపడి ఉందంటూ తన వ్యూహాన్ని సభ ముందుంచారు.సురేశ్‌ప్రభు తన ప్రసంగాన్ని ముగించే ముందు బుద్ధుడి సూక్తి చెప్పారు. ‘ఎప్పుడైనా ఎవరైనా ప్రయాణం చేయాలని తలచినప్పుడు రెండు తప్పులు చేసే అవకాశముంది. ఒకటి ప్రారంభించకపోవడం.. రెండు తుదికంటా వెళ్లకపోవడం’ అని అన్నారు. ‘మేము ఇప్పటికే ప్రయాణాన్ని ప్రారంభించేశాం.. మేము చివరి వరకూ ప్రయాణిస్తాం.. సమృద్ధి లేక విజయం అనే గమ్యస్థానానికి భారతీయ రైల్వేని తీసుకెళ్లే వరకు విశ్రమించం’ అని చెప్పారు. బడ్జెట్ ప్రసంగం ముగిసే సమయంలో కాంగ్రెస్, వామపక్షాలతోపాటు ఇతర విపక్షాల సభ్యులు లేచి నిలబడి బడ్జెట్‌పై అసంతృప్తి వెలిబుచ్చారు.బడ్జెట్ ముగిసిన వెంటనే ప్రధాని మోదీ.. సురేశ్‌ప్రభు వద్దకు వెళ్లి కరచాలనం చేసి అభినందించారు.
 
 

మరిన్ని వార్తలు