సఫారీ కారుపై చిరుత హల్‌చల్‌!

10 Feb, 2016 07:11 IST|Sakshi
సఫారీ కారుపై చిరుత హల్‌చల్‌!

ఆఫ్రికాలో పర్యాటకులకు ఎదురైన వింత అనుభవం.. వారిని ఊపిరాడకుండా చేసింది. సఫారీ జీప్ లో ప్రయాణిస్తున్న వారికి అకస్మాత్తుగా ఎదురుపడ్డ ఓ చిరుత... ఉన్నట్టుండి జీపుపై ఉరికి ఎంతో ఆనందంగా వారిని చూస్తూ కూర్చుంది. అయితే ఎంతైనా చిరుత కదా.. దాని మౌనం వెనుక ఏ ఆలోచన ఉందోనని పర్యాటకులు ఎంతో భయపడ్డారు. గంటపాటు వారి ఓపికను పరీక్షించిన చిరుత చివరకు తనంతట తానుగా జీపు దిగి.. దూరంగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఇప్పుడా పర్యాటకులు తీసిన వీడియో అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.

కెన్యాలోని మారా నేషనల్ రిజర్వ్ లో ప్రయాణికుల సఫారీ కారును అడ్డుకున్న చిరుత దాదాపు గంటపాటు వారిని కదలనీయలేదు. అయితే జీపులో ఉన్నవారికి మాత్రం ఎలాంటి హాని తలపెట్టలేదు. చిరుత ఉన్నంతసేపు వారు ప్రాణాలు ఉగ్గబట్టుకుని చూస్తూ ఉన్న ఈ మూడు నిమిషాల వీడియో క్లిప్ ఇప్పుడు హల్ చల్ చేస్తోంది. మసాయ్ మారా రిజర్వ్ పార్కునుంచి ఓపెన్ టాప్ సఫారీ కారు ప్రయాణిస్తుండగా ఉన్నట్లుండి కారుపైకి చిరుత ఎక్కడం ఒళ్ళు గగుర్పాటుకు గురిచేస్తోంది. ముందుగా పక్కనే ఉన్న గడ్డిలోంచి ప్రత్యక్షమైన ఆ అడవి మృగం...  కుడిపక్కనుంచి జీపుఎక్కి పర్యాటకుల కెమేరావైపు తేరిపార చూస్తూ ఉండిపోయింది. ఆ తర్వాత అక్కడే  ప్రశాతంగా కూర్చుండిపోయింది. దీంతో ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ కారులోని పర్యాటకులు తమ భయాన్ని పంచుకుంటూ ధైర్యాన్ని తెచ్చుకునే ప్రయత్నం చేశారు. చిరుత వెళ్ళిన తర్వాత ఊపిరి పీల్చుకుని.. అమ్మో గుండె ఎంత స్పీడుగా కొట్టుకుందో అంటూ తమ అనుభవాలను షేర్ చేసుకున్నారు.

45 నిమిషాలపాటు ఊరుకున్న టూరిస్టు గైడ్ ఇక లాభం లేదని.. చిరుత కదిలేలా లేదని తమ వాహనం ఇంజిన్ ను మెల్లగా స్టార్ట్‌ చేశాడు. దీంతో అప్పటిదాకా తీరిగ్గా కూచున్న చిరుత పులి పెద్దగా కాళ్ళు చాచి ప్రయాణీకులవైపు చూసింది. ఒళ్ళు విరుచుకొని కారు ముందుకు దిగి మెల్లగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. దీంతో పర్యాటకులు అంతా ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని గట్టిగా ఊపిరి పీల్చుకొని ఎట్టకేలకు ప్రాణాలు నిలిచినందుకు ఆనందం వ్యక్తం చేస్తుండగా వీడియో ముగుస్తుంది.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా