డబుల్‌ డెక్కర్‌.. ఉచిత ప్రయాణం

11 Nov, 2023 08:24 IST|Sakshi

హుస్సేన్‌సాగర్‌ చుట్టూ డబుల్‌ డెక్కర్‌ పరుగులు

సందర్శకులకు ఉచిత ప్రయాణ సదుపాయం

ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు

హైదరాబాద్: ఎన్నికల వేళ.. డబుల్‌డెక్కర్‌ రోడ్డెక్కింది. కొద్ది రోజులుగా హుస్సేన్‌సాగర్‌ చుట్టూ మూడు ఎలక్ట్రిక్‌ డబుల్‌ డెక్కర్‌ బస్సులు పరుగులు తీస్తున్నాయి. సందర్శకులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులు ఈ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. గతేడాది ఫిబ్రవరిలో నిర్వహించిన అంతర్జాతీయ ఫార్ములా– ఈ పోటీల సందర్భంగా హెచ్‌ఎండీఏ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ బస్సులను కొనుగోలు చేసింది. ఒక్కో బస్సు రూ.2.5 కోట్ల చొప్పున 3 బస్సులను ప్రవేశపెట్టారు. కానీ చాలాకాలం వరకు ఈ బస్సులు పార్కింగ్‌కే పరిమితమయ్యాయి.

నగరంలో వీటిని అందుబాటులోకి తెచ్చేందుకు పలు దఫాలుగా సర్వేలు నిర్వహించినప్పటికీ ఇప్పటి వరకు రూట్‌లను ఖరారు చేయలేదు. దీంతో పార్కింగ్‌కే పరిమితమైన ఈ బస్సులను ప్రస్తుతం సాగర్‌ చుట్టూ తిప్పుతున్నారు. సెక్రటేరియల్‌, అంబేడ్కర్‌ విగ్రహం, అమరుల స్మారకం ఏర్పాటు తర్వాత నెక్లెస్‌ రోడ్డుకు వచ్చే సందర్శకుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. నగరవాసులే కాకుండా వివిధ రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు, విదేశీ పర్యాటకులు సైతం నెక్లెస్‌రోడ్డు, ట్యాంక్‌బండ్‌, పరిసరాలను సందర్శించేందుకు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ క్రమంలో సాగర్‌ చుట్టూ ఉన్న అన్ని ప్రాంతాలను సందర్శించేందుకు ఈ డబుల్‌ డెక్కర్‌ బస్సులు ఎంతో ప్రయోజనకరంగా ఉన్నాయి.

ఇదీ రూట్‌...
ప్రస్తుతం సాగర్‌ చుట్టూ మూడు బస్సులు కూడా తిరుగుతున్నాయి. సంజీవయ్యపార్కు, థ్రిల్‌సిటీ, లేక్‌ఫ్రంట్‌ పార్కు, జలవిహార్‌, నీరాకేఫ్‌, పీపుల్స్‌ప్లాజా, ఇందిరాగాంధీ, పీవీల విగ్రహాలు, అంబేడ్కర్‌ 125 అడుగుల విగ్రహం తదితర ప్రాంతాలను సందర్శించిన అనంతరం సెక్రటేరియట్‌కు వెళ్లవచ్చు. అక్కడి బస్సు దిగి కొద్ది సేపు అమరుల స్మారకాన్ని సందర్శించి తిరిగి బస్సుల్లోనే ట్యాంక్‌బండ్‌ వైపు వెళ్లవచ్చు. అనంతరం ఈ డబుల్‌ డెక్కర్‌ బస్సులు ట్యాంక్‌బండ్‌ మీదుగా తిరిగి సంజీవయ్య పార్కు వరకు చేరుకొంటాయి. బస్సు మొదటి అంతస్తులో కూర్చొని ఈ రూట్‌లో ప్రయాణం చేయడం గొప్ప అనుభూతినిస్తుంది.

ఇవీ వేళలు..
ప్రతి రోజు ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు డబుల్‌ డెక్కర్‌ బస్సుల్లో సాగర్‌ చుట్టూ విహరించవచ్చు. సాయంత్రం 5 గంటల నుంచే ఎక్కువ మంది ప్రయాణికులు డబుల్‌ డెక్కర్‌ సేవలను వినియోగించుకుంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మరోవైపు శని, ఆదివారాలు, ఇతర సెలవు రోజుల్లోనూ డబుల్‌ డెక్కర్‌లకు డిమాండ్‌ కనిపిస్తోంది.

మరిన్ని వార్తలు