సిగరెట్ అమ్మలేదన్న కోపంతో భారతీయుడిని..

9 May, 2017 10:29 IST|Sakshi
సిగరెట్ అమ్మలేదన్న కోపంతో భారతీయుడిని..
కాలిఫోర్నియా: సిగరెట్ అమ్మడానికి నిరాకరించిన కారణంగా భారత సంతతికి చెందిన వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. గత వారం రోజుల్లో ముగ్గురు భారత సంతతికి చెందిన వ్యక్తులు హత్యకు గురయ్యారు. అమెరికాలోని కాలిఫోర్నియాలో శుక్రవారం రాత్రి ఈ విషాదం చోటుచేసుకుంది. ఆ వివరాలిలా ఉన్నాయి.. పంజాబ్ లోని కపుర్తలా సిటీకి చెందిన జగ్జీత్ సింగ్ 18 నెలల కిందట అమెరికాకు వెళ్లాడు. తన అక్కాబావల ఇంట్లో ఉంటూ స్థానిక స్టోర్లో క్లర్క్‌గా పనిచేస్తుండేవాడు.
 
స్టోర్‌కు వచ్చిన ఓ వ్యక్తి జాతి విద్వేష వ్యాఖ్యలతో పాటు జగ్జీత్‌పై వ్యక్తిగత దూషణకు దిగాడు. ఐడీ ఉంటే చూపించు అంటూ కాలిఫోర్నియా వ్యక్తి జగ్జీత్‌ను అడిగాడని మరో క్లర్క్‌ సుఖ్వీందర్ తెలిపారు. జాతి విద్వేష వ్యాఖ్యలు చేశాడన్న కారణంతో గుర్తుతెలియని వ్యక్తికి జగ్జీత్ సిగరెట్ అమ్మడానికి నిరాకరించాడు. ఐడీ విషయంపై ఇద్దరిమధ్య వాగ్వివాదం జరిగింది. కొంతసేపటికి ఆ వ్యక్తి తీవ్ర పదజాలంతో దూషిస్తూ అక్కడినుంచి వెళ్లిపోయాడు. 
 
దాదాపు అరగంట తర్వాత కత్తితో పరుగున వచ్చిన ఆ వ్యక్తి జగ్జీత్‌పై విచక్షణారహితంగా దాడిచేశాడు. క్షణాల్లోనే జగ్జీత్ రక్తపుమడుగులో పడిఉన్నాని సుఖ్వీందర్ తెలిపాడు. ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినా లాభం లేకపోయిందని, జగ్జీత్ చనిపోయాడని వివరించాడు. జాతి విద్వేషం కారణంగానే జగ్జీత్ బలైపోయాడని తోటి ఉద్యోగులు చెబుతున్నారు. జగ్జీత్ చాలా మంచివాడని, ఎవరినీ ఇబ్బంది పెట్టేవాడు కాదని మోనికా రోడ్రిగేజ్‌ అనే వర్కర్‌ విచారం వ్యక్తం చేసింది.
మరిన్ని వార్తలు