మీ టీవీలే మీపై నిఘానేత్రాలు!

12 Feb, 2015 17:44 IST|Sakshi
మీ టీవీలే మీపై నిఘానేత్రాలు!

గోడకు చెవులుంటాయో, లేదోగానీ మన ఇళ్లలో ఉండే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్‌కు చెవులూ కళ్లు రెండూ ఉంటాయి. ఎవరూ లేరనుకుని ప్రేయసితోనో, ప్రియుడితోనో మాట్లాడే మాటలు మనకు తెలియకుండానే క్షణాల్లో ఇంటర్నెట్‌లోకి వెళ్తాయి. అక్కడి నుంచి మనపై నిఘా వేయాలనుకునే వ్యక్తికో లేదా కంపెనీకో నేరుగా చేరుతాయి. ఇదంతా కేవలం ఒక్క టీవీతోనే సాధ్యం అయిపోతోంది!!

మన కదలికలపై ఎవరైనా నిఘా పెట్టాలంటే రహస్య కెమెరాలు అమర్చాల్సిన అవసరం లేదు. స్మార్ట్ టీవీలు మనింట్లో ఉంటే చాలు. మనం మాట్లాడే ప్రతి మాట, మన  ప్రతి కదలికను ఆ స్మార్ట్ టీవి రికార్డు చేసి ఇంటర్నెట్‌కు పంపించే అవకాశం ఉంది. స్మార్ట్ టీవీలు సాధారణంగా ఇంటర్నెట్‌కు అనుసంధానమై ఉంటాయి. నెట్‌ఫిక్స్ లాంటి సర్వీసులు లేదా బీబీసీ ఐ ప్లేయర్ల నుంచి మనకు కావాల్సిన సినిమాలు, కార్యక్రమాలను డౌన్‌లోడ్ చేసుకొని మన స్మార్ట్ టీవీల ద్వారా ఎప్పుడంటే అప్పుడు చూసుకోవచ్చు కదా. అచ్చం అలాగే మన ఇంట్లో విషయాలను అది అప్‌లోడ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుందని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ‘వాయిస్ రికగ్నైజ్డ్ సిస్టమ్’ ఉన్న టీవీలతో మన ప్రైవసీకి మరింత ప్రమాదం. మన మాటరె బట్టి ఛానళ్లు మారే సౌకర్యం కలిగిన టీవీల ముందు మనం కూర్చొని కబుర్లు చెప్పుకుంటే మన కబుర్లను ఆ టీవీలు రికార్డు చేస్తాయి. ఈ విషయాన్ని అమెరికాకు చెందిన ఓ జర్నలిస్టు ఇటీవలే ప్రత్యక్షంగా రుజువు చేశారు.

ఒక్క స్మార్ట్ టీవీలే కాదు.. ‘వాయిస్ యాక్టివేటెడ్ ఎక్స్ బాక్స్ గేమ్స్’ లాంటి గాడ్జెట్ వల్ల కూడా ఇలాంటి ముప్పు ఉంది. వాయిస్ కమాండ్ ఇస్తున్నప్పుడు ఆ కమాండ్‌తో పాటు బ్యాక్ గ్రౌండ్‌లో వినిపించే ప్రతి శబ్దం రికార్డు అవుతుందని కంపెనీ వర్గాలే స్పష్టం చేస్తున్నాయి. తమ స్మార్ట్ టీవీలను చూస్తున్న ప్రేక్షకుల మనోభావాలను తెసుకోవడానికి దక్షిణ కొరియాకు చెందిన ఓ ప్రముఖ టీవీ ఉత్పత్తుల కంపెనీ ఇటీవలనే ప్రేక్షకుల డేటాను సమీకరించింది. ఆ డేటాను ఆ కంపెనీ భద్రంగా ఉంచుతుందనే గ్యారెంటీ ఏమిటీ?...ఏ యాడ్స్ కంపెనీకో అమ్మేసే అవకాశం లేదా?

మనుషులపైనా, వ్యవస్థలపైనా నిఘా పెంచేందుకు టెలీస్క్రీన్లు ఎలా దోహదపడతాయో ప్రముఖ ప్రసిద్ధ ఆంగ్ల రచయిత జార్జి ఆర్వెల్  1949లోనే ఊహించి రాశారు. ఆప్పట్లోనే ఆయన‘1984’ పేరుతో విడుదల చేసిన ఈ నవలలో  ఓసియానియా దేశంలో పాలకపక్షం టెలీస్క్రీన్ల ద్వారా ప్రతిపక్ష పార్టీపై నిఘా పెట్టి ఆ పార్టీ నాయకుల కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటుంది. ఆ నవలలో జార్జి ఆర్వెల్ ఊహించిన దానికన్నా ఇప్పటి టీవీల్లో నిఘా పరికరాలు ఇంకా ఎక్కువగా ఉన్నాయి.  స్మార్ట్ టీవీల్లో ఎదురుగా ఉండే మనుషులను గుర్తుపట్టే ఫీచర్ కోసం శక్తివంతమైన కెమేరాలు వాడుతున్నారు. అవే అవసరమైతే మనపై నిఘా నేత్రాలుగా పనిచేస్తాయి. ప్రైవసి కోసం ఎలక్ట్రానిక్ నిఘా నేత్రాలు లేని ఏ పచ్చిక బయళ్లకో, లోయల్లోకో, ఎడారులకో పోదామా?... అలాంటి ప్రదేశాల్లో కూడా గూగుల్ ఎర్త్ ద్వారా మనపై నిఘా వేయవచ్చేమో!

>
మరిన్ని వార్తలు