జపాన్‌ విద్యావ్యవస్థ ఎందుకు బెస్ట్ అంటే...

14 Aug, 2016 19:22 IST|Sakshi
జపాన్‌ విద్యావ్యవస్థ ఎందుకు బెస్ట్ అంటే...

జపాన్‌.. ప్రస్తుతం అన్నిరంగాల్లోనూ అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్న దేశం. అణుదాడికి గురై, కోలుకోలేని స్థాయిలో నష్టపోయిన ఆ దేశం ఇప్పుడు ప్రపంచంలోనే బలమైన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలవడం గొప్ప పరిణామం. వివిధ రంగాల్లో ఈ దేశం అనుసరిస్తున్న విధానాల వల్లే ఈ మార్పు సాధ్యమైంది. ముఖ్యంగా దేశంలో విద్యారంగంలో అనుసరిస్తున్న విధానాలు ప్రపంచానికి మార్గదర్శకం. ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యావిధానం జపాన్‌దే. ఇక్కడ చదువుతోపాటు ఇతర అంశాలకూ ప్రాధాన్యం ఇస్తారు. నైతిక విలువలు, సత్ప్రవర్తన, క్రమశిక్షణ వంటి ఎన్నో అంశాల్ని విద్యార్థి దశలోనే పిల్లలకు నేర్పిస్తారు. జపాన్‌ విద్యావ్యవస్థ ఉత్తమంగా నిలవడానికి గల కారణాలేంటో తెలుసుకుందాం..     
    
సంస్కారమే ముందు..
ప్రాథమిక స్థాయిలో విద్యార్థులకు చదువుకంటే ముందు ఇతర అంశాలు నేర్పుతారు. నాలుగో తరగతి లేదా కనీసం పదేళ్లు వయసు వచ్చేవరకు విద్యార్థులకు ఎటువంటి పరీక్షలు నిర్వహించరు. ఈ వయసులోపు పిల్లల తెలివితేటలు, నేర్చుకునే శక్తిని పరీక్షించకూడదని అక్కడి పాఠశాలల సిద్ధాంతం. కేవలం వారికి మంచి సత్ప్రవర్తనను నేర్పి, మంచి వ్యక్తులుగా ఎదిగేందుకు తోడ్పడేలా మాత్రమే శిక్షణ ఉంటుంది. ఇతరులను ఎలా గౌరవించాలి.. వారితో మర్యాదగా ఎలా ప్రవర్తించాలి.. మూగజీవాలపై ఎలా ప్రేమ చూపాలి.. ప్రకృతి విషయంలో ఎంత బాధ్యతగా వ్యవహరించాలి.. జాలి, దయ, కరుణ వంటి అంశాలపై అవగాహన కల్పించేలా చేస్తారు. వీటితోపాటు స్వీయ నియంత్రణ, చిత్తశుద్ధి, న్యాయం, దృఢ సంకల్పంలను గురించి వివరిస్తారు. అమితమైన జ్ఞానం కంటే మనిషికి ఉన్నత విలువలే ముఖ్యమని ప్రాథమిక స్థాయిలో ఎక్కువగా బోధిస్తారు.

ఏప్రిల్‌ నుంచే..
మన దేశంలో వేసవి కాలం ముగియగానే కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది. ప్రపంచంలోని అనేక దేశాల్లో సెప్టెంబర్, అక్టోబర్‌లలో కొత్త విద్యా సంవత్సరం మొదలవుతుంది. కానీ జపాన్‌లో మాత్రం ఏప్రిల్‌ నుంచి ప్రారంభమవుతుంది. ఇక్కడ కొత్త ఆర్థిక సంవత్సరం కూడా ఇదే నెల నుంచి కొనసాగుతుంది. విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే మొదటి రోజున ఇక్కడ వసంతకాలం కావడంతో చెట్లంతా చిగురించి, పచ్చదనంతో, వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. విద్యా సంవత్సరం మూడు త్రైమాసికాలుగా విభజించారు. ఏప్రిల్‌1– జూలై 20 వరకు ఒకటి, సెప్టెంబర్‌ 1–డిసెంబర్‌ 26 వరకు రెండవ త్రైమాసికం కాగా..జనవరి 7– మార్చి 25 వరకు చివరి త్రైమాసికం ఉంటుంది. వేసవికాలం ఆరు వారాలు, వర్షాకాలం, చలికాలంలో రెండు వారాలు సెలవులు ఇస్తారు.

99.99 శాతం హాజరు..
ఇక్కడి విద్యార్థుల్లో ఉన్న ఉత్తమ లక్షణాల్లో ఒకటి పూర్తిసమయం పాఠశాలకు హాజరు కావడం. అత్యవసరమైతే తప్ప తరగతులకు హాజరుకాకుండా ఉండరు. చిన్నచిన్న కారణాలకే పాఠశాలకు దూరంకావడం వంటివి చేయరు. ఒకవేళ ఆలస్యమైనప్పటికీ, స్కూలుకు హాజరవుతారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు తప్పనిసరిగా ప్రతిరోజూ స్కూలుకు వెళ్లేలా చూస్తారు. అందువల్లే జపాన్‌లో విద్యార్థుల సగటు హాజరు శాతం 99..99గా ఉంది. ప్రపంచంలో ఇదే అత్యుత్తమ విద్యార్థుల హాజరు శాతం. అక్కడి ప్రజల్లో దాదాపు 91 శాతం మంది ప్రతిరోజూ స్కూలుకు హాజరయ్యేవారట. అలాగే పాఠశాల స్థాయిలో విద్యార్థులు తప్పనిసరిగా యూనిఫాం ధరించాల్సిందే. దాదాపు అందరు విద్యార్థులు ఈ నిబంధనను కచ్చితంగా పాటిస్తారు.

వర్క్‌షాపులు తప్పనిసరి..
ప్రతి రోజూ ఎనిమిది గంటలపాటు పాఠశాలలు కొనసాగుతాయి. అయితే స్కూల్‌ పూరై్తన తర్వాత ఎక్కువ మంది విద్యార్థులు ప్రత్యేక వర్క్‌షాప్‌లకు హాజరవుతారు. ఈ ప్రత్యేక తరగతుల్లో హోం వర్క్‌తోపాటు, ఇతర క్రీడలు, సాంకేతిక, కళాత్మక అంశాల్లో శిక్షణ ఇస్తారు. రోజూ సాయంత్రమే కాకుండా, సెలవు రోజుల్లో కూడా ఇవి కొనసాగుతాయి. ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటారు కాబట్టి పాఠశాల స్థాయిలో ఒకే తరగతిని రెండోసారి చదవడం ఉండదు.

అందరికీ ఒకే లంచ్‌..
విద్యార్థులు చదువులో రాణించాలన్నా, మంచి ఎదుగుదల కావాలన్నా పోషకాహారం తప్పనిసరి. ఈ అవసరాన్ని గుర్తించిన జపాన్‌ పాఠశాలలు విద్యార్థులకు అక్కడే తయారు చేసిన పోషకాహారాన్ని అందిస్తాయి. పబ్లిక్‌ స్కూల్స్‌లో విద్యార్థులు అందరికీ ఒకే రకమైన మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నారు. ఇక్కడ అందరూ పాఠశాలల్లో తయారు చేసిన ఆహారమే తినాల్సి ఉంటుంది. పైగా క్లాస్‌రూముల్లోనే, ఉపాధ్యాయులతో కలిసి భోజనం చేయాలి. పిల్లలకు అందించే ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. పోషకాహార, ఆరోగ్య నిపుణుల సూచనలను అనుసరించి, మంచి చెఫ్‌లతో తయారు చేసిన ఆహార పదార్థాల్నే విద్యార్థులకు అందిస్తారు. మెనూను తప్పనిసరిగా పాటిస్తారు.

శుభ్రత వారి బాధ్యతే..
జపాన్‌లో పాఠశాలల్ని విద్యార్థులే శుభ్రం చేస్తారు. క్లాస్‌రూమ్‌లు, క్యాంటీన్, లైబ్రరీ, ల్యాబ్స్ తోపాటు టాయిలెట్స్‌ కూడా వారే శుభ్రం చేసుకుంటారు. ఇందుకోసం రోజూ కొంత సమయాన్ని కేటాయిస్తారు. ఈ పనుల కోసం విద్యా సంవత్సరం ప్రారంభంలోనే విద్యార్థుల్ని అనేక చిన్న గ్రూపులుగా విభజిస్తారు. ఈ బృందాలు ఆ ఏడాది మొత్తం కొనసాగుతాయి. ఇలా స్వంతంగా శుభ్రం చేసుకోవడం, బృందాలుగా కలిసి పనిచేయడం వల్ల వారికి పని విలువ తెలుస్తుందని, ఒకరితో ఒకరు పరస్పర సహకారంతో పనిచేయడం అలవడుతుందనేది అక్కడి విద్యావేత్తల విశ్వాసం.

ఒక్క పరీక్షే కీలకం..
ఎన్నో ప్రత్యేకతలున్న జపాన్‌ విద్యా వ్యవస్థలో మరో కీలకమైన అంశం పరీక్షలు. హైస్కూల్‌ స్థాయి విద్యాభ్యాసం ముగిసిన తర్వాత కళాశాలలో ప్రవేశం పొందడం ఇక్కడ చాలా క్లిష్టమైన ప్రక్రియ. కేవలం ఒక్క పరీక్షే విద్యార్థుల భవిష్యత్‌ను నిర్ణయిస్తుంది. హైస్కూల్‌ చదువు పూర్తయ్యాక నిర్వహించే చివరి పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగానే కళాశాలల్లో సీటు లభిస్తుంది. ఈ దశలో పోటీ అధికంగా ఉంటుంది. ఇందుకోసం తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంది. మంచి కాలేజిలో చేరాలంటే వారి నిబంధనలకు అనుగుణంగా, అవసరమైన స్కోరు సాధిచాల్సిందే. పాఠశాల విద్యార్థుల్లో 76 శాతం మందే ఉన్నత విద్యను కొనసాగిస్తారు.

మరిన్ని వార్తలు