అమెరికా వీసా మరింత కఠినం!

2 Jun, 2017 02:31 IST|Sakshi
అమెరికా వీసా మరింత కఠినం!
సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌: అమెరికా వీసాకు దరఖాస్తు చేస్తున్నారా? ఇక నుంచి అగ్రరాజ్యం వీసా పొందడం అంత ఈజీ కాదు.. వీసా దరఖాస్తు పరిశీలన సమయంలో ఏదైనా అనుమానమొస్తే.. మీ ఫేస్‌బుక్, ట్వీటర్‌ ఖాతాల వివరాలతో పాటు, మీ వ్యక్తిగత వివరాలన్నీ పూసగుచ్చినట్లు చెప్పాల్సిందే.. వాటిని చెక్‌ చేసి.. మీపై ఎలాంటి వివాదాలు లేవంటేనే వీసా మంజూరు.. లేదంటే నిరాకరణే.. వీసా నిబంధనల్ని మరింత కఠినం చేస్తూ ట్రంప్‌ సర్కారు తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. అమెరికా కాన్సులేట్‌ ఉద్యోగులకు అనుమానం వస్తే.. గత ఐదేళ్ల సోషల్‌ మీడియా ఖాతాల వివరాలతో పాటు 15 ఏళ్ల వ్యక్తిగత వివరాలు వెల్లడించాలని షరతులు విధించింది.

ఈ మేరకు కొత్త నిబంధనల్ని డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం రూపొందించింది. ఈ నిబంధనలకు మే 23న అమెరికా మేనేజ్‌మెంట్, బడ్జెట్‌ శాఖ ఆమోదించింది. అన్ని పాత పాస్‌పోర్టు నంబర్లు, సోషల్‌ మీడియా అకౌంట్ల వివరాలు, ఈమెయిల్‌ ఐడీలు, అంతవరకూ వాడిన ఫోన్‌ నంబర్లు, చిరునామాలు, చేసిన ఉద్యోగాల వివరాలు, ప్రయాణాల చిట్టా వంటి సమాచారం సహా 15 సంవత్సరాల వ్యక్తిగత వివరాల్ని సమర్పించాలి. 
 
పొరపాటున లైక్, రీట్వీట్‌ చేసినా...
ఈ కొత్త ప్రతిపాదనలపై బహిరంగ విచారణ జరిగిన సమయంలో విద్యాశాఖ అధికారులు, అకడమిక్‌ వర్గాలు అభ్యంతరాలు లేవనెత్తాయి. 15 ఏళ్ల వ్యక్తిగత వివరాలు గుర్తుపెట్టుకోవడం కష్టం. వీసా దరఖాస్తుదారులు గతంలో అమెరికాకు వ్యతిరేకంగా సోషల్‌ మీడియా అకౌంట్లలో వ్యాఖ్యలు చేస్తే.. ఇక అంతే. పొరపాటున ఎవరో పెట్టిన కామెంట్‌ను మనం రీట్వీట్, రీపోస్ట్‌ చేసినా, లైక్‌ కొట్టినా... అమెరికా వ్యతిరేకిగా ముద్ర వేసేస్తారు. ‘అమెరికా నశించాలి’, ట్రంప్‌ డౌన్‌ డౌన్‌ వంటి నినాదాలు, అమెరికా పాలకులకు, విధానాలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తే ఇంటర్వూ్యకు వెళ్లే సమయంలో దరఖాస్తుదారులు గుర్తించుకోవాల్సి ఉంటుంది.

కొత్త ప్రశ్నలకు జవాబులివ్వడం, వాటిని అధికారులు పరిశీలించడాని కి సమయం పట్టడం వల్ల వీసా ప్రక్రియ ఆలస్యమవుతుంది. దీని వల్ల విద్యార్థులు, శాస్త్రవేత్తలు అమెరికా వచ్చేందుకు విముఖత చూపే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘‘15 ఏళ్ల పూర్తి వ్యక్తిగత వివరాలు చెప్పడం అంత తేలిక కాదు. దరఖాస్తుదారులందరూ తమ సామాజిక మాధ్యమాల యూజర్‌నేమ్‌లు, అకౌంట్ల వివరాలు గుర్తుంచుకోవడం కష్టం. కొందరు పొరపాటున తప్పు చెప్పినా.. అదనపు సమాచారం అందించకపోయినా వీసాలు పొందడం కష్టమ’ని ఇమిగ్రేషన్‌ లాయర్లు హెచ్చరిస్తున్నారు. 
 
కాన్సులర్‌ నిర్ణయమే అంతిమం!
‘కొత్త ప్రశ్నావళి అమల్లోకి వస్తే ఎవరికి వీసా ఇవ్వాలనే విషయమై కాన్సులర్‌ అధికారులకు విచక్షణాధికారాలు ఉంటాయి. వారి నిర్ణయాలపై తనిఖీ ఉండకపోవచ్చు. ఇప్పటికే ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వీసా దరఖాస్తు ప్రక్రియను అమెరికా అనుసరిస్తోంది. ఈ కొత్త పద్ధతితో మరిన్ని ఇబ్బందులు ఎదురుకావచ్చ’ని శాన్‌ ఫ్రాన్సిస్కో లాయర్‌ బాబక్‌ యూసఫ్‌జాదే అన్నారు.  

 

మరిన్ని వార్తలు