ట్రంప్ తాజా బెదిరింపు : ట్రేడ్ వార్ భయాలు

1 May, 2020 17:28 IST|Sakshi
అధ్యక్షుడు  డొనాల్డ్ ట్రంప్ ( ఫైల్ ఫోటో)

చైనా వస్తువులపై మళ్లీ టారీఫ్ లు విధిస్తాం - ట్రంప్

చైనా రుణాలను రద్దు చేయడంపై చర్చలు 

వాష్టింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై తన దాడిని అప్రతిహతంగా కొనసాగిస్తూనే ఉన్నారు. ట్రంప్ తాజా సంచలన వ్యాఖ్యలతో ప్రపంచ అగ్ర ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, చైనా మధ్య  ట్రేడ్ వార్  మళ్లీ రాజుకోనుంది. కోవిడ్-‌19 కారణంగా చైనాపై వాణిజ్య సుంకాలను పెంచనున్నట్లు ట్రంప్  బెదిరించారని  గురువారం స్థానిక మీడియా నివేదించింది. చైనా నుంచే  కరోనా మహమ్మారి వ్యాపించిందని పదే పదే దాడి చేస్తున్న ట్రంప్ చైనాతో వాణిజ్య ఒప్పందం తమకు ద్వితీయ ప్రాముఖ్యత అంటూ వాణిజ్య యుద్దానికి తెరలేపారు. వాణిజ్య ఒప్పందంపై సంతకం చేసాం. నిజానికి చాలా వాణిజ్యం జరుగుతోంది. కానీ ఇప్పుడు  కరోనా వైరస్‌ తో తమకు జరిగి నష్టం కారణంగా ఈ నిర్ణయం తీసుకోన్నామని ట్రంప్ విలేకరులతో అన్నారు. వైరస్, లాక్‌డౌన్, ఆర్థిక నష్టాలు ఈ పరిస్థితి ఆమోదయోగ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. 

అలాగే పారదర్శకత పాటించని చైనాకు అమెరికా రుణాన్ని రద్దు చేయాలనే ఆలోచనపై అధికారులు చర్చించినట్లు వాషింగ్టన్ పోస్ట్ గురువారం నివేదించింది. అయితే దీన్ని  ట్రంప్ అత్యున్నత ఆర్థిక సలహాదారు లారీ కుడ్లో ఖండించారు. మరోవైపు రుణాల రద్దు, చైనాపై అమెరికా ప్రతీకారంపై ప్రశ్నించినపుడు ట్రంప్ రాయిటర్స్‌తో మాట్లాడుతూ దీన్ని భిన్నంగా  చేయనున్నామని వ్యాఖ్యానించారు.  

చైనా అమెరికా మధ్య మొదటి దశ వాణిజ్య ఒప్పందంపై జనవరిలో ట్రంప్‌ సంతకం చేశారు. ఈ ఒప్పందం ప్రకారం ఏటా 370 బిలియన్ డాలర్ల విలువైన చైనా వస్తువుల దిగుమతులపై 25 శాతం వరకు సుంకం అమలవుతోంది. చైనా ఎగుమతి చేసే కొన్ని రకాల వస్తువులపై సుంకాలను తగ్గింపు ప్రతిపాదన కూడా ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ప్రతిపాదనను పక్కనపెట్టి టారీఫ్‌లను ట్రంప్‌ పెంచనున్నారనే ఆందోళన వ్యక్తమవుతోంది. (అమెరికాపై చైనా విమర్శలు: నెటిజన్ల ఫైర్‌!)

కరోనా వైరస్‌ చైనాలోని వుహాన్‌లోని వైరాలజీ ల్యాబ్‌ నుంచే బయటకు వచ్చిందని, దీనికి  తమవద్ద స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని తెలిపారు ట్రంప్ ఆరోపించారు. ఈ విషయంపై లోతైన విచారణ జరుగుతోందని త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడిస్తామని పేర్కొన్నారు. కరోనావైరస్ మూలం, వ్యాప్తిలో చైనా పాత్ర గురించి తన ఆందోళనలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ట్రంప్ స్పష్టం చేశారు, కోవిడ్-‌19 మనుషులు సృష్టించింది కాదని అమెరికా నిఘా సంస్థలు స్పష్టం చేసిన కొన్ని గంటల్లోనే డోనాల్డ్‌ ట్రంప్‌ సంచలన ప్రకటన చేయడం గమనార్హం.

కాగా కరోనా విజృంభణతో అమెరికాలో 60 వేలమందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. పాజిటివ్ కేసుల సంఖ్య 10 లక్షలు దాటింది. మిలియన్ కేసులను దాటిన మొదటి దేశంగా అమెరికా నిలిచింది. దీనికి తోడు రెండోసారి అధ్యక్ష ఎన్నికలకు సిద్దమవుతున్న తరుణంలో దేశంలోని తీవ్ర ఆర్థిక సంక్షోభం అమెరికా అధ్యక్షుడిని భయపెడుతోంది. ఈ నేపథ్యంలో తన గెలుపును అడ్డుకునేందుకు చైనా కుట్రచేసిందని ట్రంప్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కోవిడ్-‌19 చైనానే తయారు చేసిందని ఆరోపిస్తున్నారని అధికార, ప్రతిపక్షాల నుంచి విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు