ఎయిర్‌పోర్టులో.. ఎదురుచూడక తప్పదు

14 May, 2016 16:47 IST|Sakshi
ఎయిర్‌పోర్టులో.. ఎదురుచూడక తప్పదు

న్యూయార్క్: విమానాశ్రయాల్లో సెక్యూరిటీ చెక్ పాయింట్ల వద్ద ప్రయాణికులను తనిఖీ చేయడానికి అమెరికా అంతర్గత భద్రత శాఖ మరి కొంతమంది అధికారులను నియమించింది. సెక్యూరిటీ చెక్ పాయింట్ల వద్ద పొడవాటి క్యూ లైన్లలో ప్రయాణికులు వేచి ఉండాల్సి రావడం, తనిఖీలకు ఎక్కువ సమయం పడుతుండటాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా వేసవిలో ప్రయాణకుల రద్దీ ఎక్కువగా ఉండటంతో తనిఖీల కోసం వేచి ఉండక తప్పదని అంతర్గత భద్రత శాఖ మంత్రి జెహ్ జాన్సన్ చెప్పారు.

వాషింగ్టన్ రీగన్ జాతీయ విమానాశ్రయం వెలుపల మీడియా సమావేశంలో జాన్సన్ మాట్లాడుతూ.. విమానాశ్రయాల్లో ప్రయాణికుల సౌకర్యార్థం ఈ చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. రవాణ భద్రత సంస్థ కూడా ఈ ఏడాదిలో 768 మంది కొత్త సెక్యూరిటీ అధికారులను తీసుకోవాలని నిర్ణయించిందని వెల్లడించారు. ఈ వేసవిలోనే జూన్ మధ్యకల్లా వీరి సేవలు అందుబాటులోకి వస్తాయని టీఎస్ఏ ఆశిస్తున్నట్లు చెప్పారు. విమానాశ్రయాల్లో తనిఖీల కోసం టీఎస్ఏ మరిన్ని చర్యలు తీసుకుంటున్న తెలిపారు. మరిన్ని శునకాలను మోహరించనున్నట్టు చెప్పారు. ప్రయాణికుల సౌకర్యంతో పాటు భద్రత కూడా తమకు ముఖ్యమని, భద్రత విషయంలో రాజీపడబోమని జాన్సన్ స్పష్టం చేశారు.

అమెరికా విమానాశ్రయాల్లో సెక్యూరిటీ చెక్ పాయింట్ల లైన్ల వద్ద ప్రయాణికులు ఎక్కువ సమయం వేచి ఉండాల్సి వస్తోంది. లాగ్వార్డియా వద్ద ఇంత పొడవాటి సెక్యూరిటీ లైన్ను ఎప్పుడూ చూడలేదని లిసా అకే అనే ప్రయాణికురాలు ట్వీట్ చేసింది. ఇక అట్లాంటాలోని హర్ట్స్ఫీల్డ్ జాక్సన్ ఇంటర్నేషన్ ఎయిర్పోర్టులో లైన్లో రెండు గంటల పాటు వేచిచూడాల్సి వచ్చిందని కిమ్ జోన్స్ అనే మరో ప్రయాణికురాలు వాపోయింది. ఇంటర్నేషనల్ టర్మినల్ గుండా వెళ్లమని టీఎస్ఏ అధికారి చెప్పడంతో తాను ఫ్లైట్ అందుకోగలిగాని చెప్పింది. ఇక ప్రయాణికుల వేలాది లగేజీ బ్యాగులు  తప్పిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. ప్రపంచంలోనే ప్రయాణికులతో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో అట్లాంటా ఒకటి. ప్రయాణికుల రద్దీ పెరుగుతుండటం దృష్ట్యా, స్టాఫ్ను పెంచాలని కోరుతూ గత ఫిబ్రవరిలో విమానాశ్రయ అధికారులు టీఎస్ఏకు లేఖ రాశారు. గతేడాది ఈ విమానాశ్రయంలో ప్రయాణికుల రద్దీ 10 కోట్లు ఉందని చెప్పారు.

అమెరికాలో రద్దీ ఉన్న విమానాశ్రయాల్లో సెక్యూరిటీ చెక్ పాయింట్ల లైన్లలో ప్రయాణికులు వేచి ఉండే సమయాన్ని తగ్గించడం కోసం ప్రైవేట్ సెక్యూరిటీ సంస్థల సహకారం తీసుకుంటోంది. టీఎస్ఏలో రెండేళ్ల క్రితం వేలాది మంది ఉద్యోగుల సేవలను కోల్పోయిందని, వారి స్థానాల్లో కొత్తవారిని నియమించకపోవడం సమస్యగా మారిందని ఆ సంస్థ అధికారి పీటర్ నెఫెంజర్ చెప్పారు. 2014లోనే టీఎస్ఏ 4644 మంది ఉద్యోగుల సేవలను కోల్పోగా, కొత్తగా 373 మందిని మాత్రమే తీసుకుందని వివరించారు.

 

 


 

>
మరిన్ని వార్తలు