Disha Naik: ఎయిర్‌పోర్ట్‌ ఫైర్‌ఫైటర్‌

30 Nov, 2023 00:54 IST|Sakshi

న్యూస్‌ మేకర్‌

గోవాకు చెందిన దిశా నాయక్‌ చరిత్ర సృష్టించింది. విమానాశ్రయాల్లో అగ్ని ప్రమాదాలను నివారించే భారీ వాహనం ‘క్రాష్‌ ఫైర్‌ టెండర్‌’ను నడిపే తొలి భారతీయ వనితగా గోవా ఎయిర్‌పోర్ట్‌లో ప్రమోట్‌ అయ్యింది. గోవా వాసులు సరే, విమానయాన రంగం కూడా ఆమెను ప్రశంసగా చూస్తోంది.

అగ్నిప్రమాదాలు ప్రాణాంతకం. ఎయిర్‌పోర్ట్‌లో జరిగే అగ్ని ప్రమాదాలు మరీ తీవ్రం. సెకన్ల వ్యవధిలో చావు బతుకులు నిర్ణయమవుతాయి సరిగ్గా స్పందించకపోతే. అందుకే ప్రత్యేకంగా ‘ఏరోడ్రోమ్‌ రెస్క్యూ అండ్‌ ఫైర్‌ఫైటింగ్‌’ (ఏ.ఆర్‌.ఎఫ్‌.ఎఫ్‌.) సర్వసమయాల్లోనూ సిద్ధంగా ఉంటుంది ప్రతి ఎయిర్‌పోర్ట్‌లో. అయితే ఈ విభాగంలో స్త్రీల ప్రాతినిధ్యం చాలా తక్కువ.

2021 వరకు గోవాలో ఒక్క మహిళ కూడా ఈ విభాగంలో లేదు. దిశా నాయక్‌ ఈ ఉద్యోగంలో చేరి గోవాలో తొలి ఎయిర్‌పోర్ట్‌ ఫైర్‌ఫైటర్‌గా నిలిచింది. ఇప్పుడు ఆమె ‘క్రాష్‌ ఫైర్‌ టెండర్‌’ నడిపే ఫైర్‌ఫైటర్‌గా ప్రమోట్‌ అయ్యింది. దాంతో మన దేశంలో క్రాష్‌ ఫైర్‌ టెండర్‌ను ఆపరేట్‌ చేసే తొలి సర్టిఫైడ్‌ ఉమన్‌ ఫైర్‌ఫైటర్‌గా ఆమె చరిత్ర సృష్టించింది.

క్రాష్‌ ఫైర్‌ టెండర్‌ (సి.ఎఫ్‌.టి.) అంటే?
ఇది హైటెక్‌ ఫైర్‌ ఇంజిన్‌. అగ్నిమాపక దళంలో కనిపించే ఫైర్‌ ఇంజిన్‌కు, దీనికి చాలా తేడా ఉంటుంది. ఎయిర్‌పోర్ట్‌లో, విమానాలు ల్యాండ్‌ అయ్యేటప్పుడు ఏదైనా అగ్నిప్రమాదం సంభవిస్తే వెంటనే మంటలార్పేలా ఈ ఫైర్‌ ఇంజిన్‌ను తయారు చేస్తారు. దీనిని నడపడానికి, మంటలు ఆర్పేలా ఆపరేట్‌ చేయడానికి తీవ్రశిక్షణ అవసరం. సాధారణంగా మగవారు రాణించడానికే కొంత శ్రమ పడతారు. అలాంటిది దిశా నాయక్‌ అన్ని పరీక్షలు పాసై సి.ఎఫ్‌.టి.ని ఆపరేట్‌ చేసే మహిళా ఫైర్‌ఫైటర్‌ అయ్యింది.

యూనిఫామ్‌ ఉండే ఉద్యోగం చేయాలని..
గోవాలోని పెర్నెమ్‌కు చెందిన దిశా నాయక్‌కు బాల్యం నుంచి యూనిఫామ్‌ ఉండే ఉద్యోగం చేయాలని కోరిక. అయితే చదువు పూర్తయ్యాక అలాంటి ఉద్యోగం ఏమీ దొరకలేదు. 2021లో గోవాలోని ‘మనోహర్‌ ఇంటర్‌నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌’లో ఫైర్‌ఫైటర్‌ ఉద్యోగాలకు పోస్టులు పడ్డాయి. ఎయిర్‌పోర్ట్‌ అగ్నిమాపక దళం లో అప్పటికి ఎవరూ అమ్మాయిలు లేకపోయినా దిశా అప్లై చేసింది. ‘మా అమ్మాయి చిన్నప్పటి నుంచి చాలా చురుకు. మోటర్‌ సైకిల్‌ నడిపేది. రన్నింగ్‌ బాగా చేసేది. ఆమె ఫైర్‌ఫైటర్‌గా చేరతానంటే రాణిస్తుందనే నమ్మకంతోనే ప్రోత్సహించాం’ అంటారు తల్లిదండ్రులు. వారి ప్రోత్సాహంతో జూన్‌ నెలలో ఉద్యోగంలో చేరింది దిశా.

అంచెలంచెలుగా ఎదిగి
ఉద్యోగంలో చేరినప్పటి నుంచి దిశాలోని చురుకుదనం, అంకితభావం పై అధికారులు గమనించారు. కేవలం సహాయక సిబ్బందిగా ఉండటం కంటే క్రాష్‌ ఫైర్‌ టెండర్‌ను నడిపేందుకు ఆమె ఆసక్తి చూపడం గమనించి ఆమెను ట్రైనింగ్‌కి పంపారు. తమిళనాడులోని నమక్కల్‌లో ఆరునెలల పాటు శిక్షణ తీసుకుంది దిశ. ఎయిర్‌పోర్ట్‌లో అగ్నిప్రమాదాలు సంభవించే తీరు, ఏ ప్రమాదంలో సి.ఎఫ్‌.టి.ని ఎలా ఉపయోగించాలి... అక్కడ ఆమెకు నేర్పించారు. తిరిగి వచ్చాక ఉన్నతాధికారులు ప్రత్యేక పరీక్షలు నిర్వహించి ఆమె ప్రావీణ్యాన్ని నిర్థారించి సి.ఎఫ్‌.టి ఆపరేటర్‌గా ప్రమోట్‌ చేశారు. ‘ఆమె అన్నిరకాల పరీక్షల్లో ఉత్తమంగా నిలిచింది’ అని తెలిపారు.

అన్నివిధాలా సిద్ధంగా
‘అగ్నిప్రమాదం జరిగినప్పుడు వెంటనే సంఘటనాస్థలికి చేరుకోవడం కంటే చేరుకున్నాక ఏం చేయాలన్నదే ఎక్కువ ముఖ్యం. ఎయిర్‌పోర్ట్‌ ఫైర్‌ఫైటర్‌గా పని చేసేవారికి ఎయిర్‌పోర్ట్‌లోని అన్ని ప్రవేశమార్గాలు, కీలకమైన ద్వారాలు, ముఖ్యస్థానాలు మైండ్‌లో ప్రింట్‌ అయి ఉండాలి. ప్రమాదం జరిగితే ఎక్కడికి చేరి ఎలా కాపాడాలన్నదే ముఖ్యం. ఈ ఉద్యోగంలో క్షణాల్లో యూనిఫామ్‌లోకి మారి వెహికిల్‌లో కూచోవాలి. శారీరక బలంతో పాటు మానసిక బలం ప్రదర్శించాలి. సాంకేతిక జ్ఞానం కూడా తప్పనిసరి’ అని తెలిపింది దిశ.

మరిన్ని వార్తలు