కొరియా’పై యుద్ధవిమానాలు

19 Sep, 2017 02:56 IST|Sakshi
కొరియా’పై యుద్ధవిమానాలు

సియోల్‌: దక్షిణ కొరియా, జపాన్‌తో సంయుక్తంగా అమెరికా సైనిక బలగాలు సోమవారం శక్తిమంతమైన అత్యాధునిక యుద్ధ విమానాలతో విన్యాసాలు నిర్వహించాయి. కొరియా ద్వీపకల్పం, జపాన్‌ సమీప ప్రాంతాల మీదుగా ఈ విన్యాసాలు కొనసాగాయి. ఈ విన్యాసాల్లో అమెరికా సైన్యానికి చెందిన రెండు బీ–1బీలు, నాలుగు ఎఫ్‌–35బీ యుద్ధవిమానాలు పాల్గొన్నాయి. వీటితోపాటు దక్షిణ కొరియా బలగాలకు చెందిన నాలుగు ఎఫ్‌–15కే యుద్ధవిమానాలు ఈ విన్యాసాల్లో పాల్గొన్నాయని దక్షిణ కొరియా, అమెరికా బలగాలు తెలిపాయి.

క్యూషూ ద్వీపకల్ప ప్రాంతంలోని సముద్రం మీదుగా కూడా యుద్ధ విమానాలు విన్యాసాలు చేసినట్లు వెల్లడించాయి. జపాన్‌ మీదుగా ఉత్తరకొరియా క్షిపణిని ప్రయోగించిన మూడు రోజుల తర్వాత అమెరికా ఈ విన్యాసాలు నిర్వహించడం గమనార్హం. ఉత్తర కొరియా, అమెరికా మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడినప్పటి నుంచి తరచూ అమెరికా పలు శక్తిమంతమైన యుద్ధవిమానాలతో తమ బలాన్ని ప్రదర్శిస్తోంది. ఐక్యరాజ్యసమితి ఆంక్షలు విధించినప్పటికీ సెప్టెంబర్‌ 3వ తేదీన ఉత్తర కొరియా ఆరోసారి అణు పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. అమెరికాకు సమానంగా సైనిక శక్తిని కూడగట్టుకోవాలన్న లక్ష్యంతో ఉత్తర కొరియా ఉందని ఆ దేశ అధికార మీడియా పేర్కొంది.

మరిన్ని వార్తలు