సమన్వయ సమితుల పేరిట రాజకీయం

19 Sep, 2017 02:56 IST|Sakshi
సమన్వయ సమితుల పేరిట రాజకీయం
- 2019లో రాష్ట్రంలో కాంగ్రెస్‌దే అధికారం 
ఇందిరమ్మ రైతుబాటలో కాంగ్రెస్‌ అగ్రనేతలు
 
సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతు సమన్వయ సమితులు, భూరికార్డుల శుద్ధీకరణ పేరిట చీఫ్‌ పాపులారిటీ కోసం రాజకీయం చేస్తోందని కాంగ్రెస్‌ నేతలు ధ్వజమెత్తారు. సోమవారం కరీంనగర్‌ జిల్లా కాంగ్రెస్‌ కమిటీ ఆధ్వర్యంలో ఇందిరాగార్డెన్‌లో నిర్వహించిన ‘ఇందిరమ్మ రైతుబాట’కార్యక్రమంలో భాగంగా రెవెన్యూ రికార్డులపై కాంగ్రెస్‌ కార్యకర్తలకు అవగాహన సదస్సు నిర్వహించారు.

కరీంనగర్‌ డీసీసీ అధ్యక్షుడు కటుకం మృత్యుంజయం అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శి, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి రాంచంద్ర కుంతియా, ఎస్సీసెల్‌ జాతీయ అధ్యక్షులు కొప్పుల రాజు, టీపీసీసీ అధ్యక్షుడు ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మల్లు భట్టివిక్రమార్క, సీఎల్పీ నేత కె.జానారెడ్డి, రాష్ట్ర మీడియా కన్వీనర్‌ మల్లు రవి, కిసాన్‌ సెల్‌ రాష్ట్ర చైర్మన్‌ ఎం.కోదండరెడ్డి, పొన్నం ప్రభాకర్, రాష్ట్ర నాయకులు, ఉమ్మడి జిల్లాకు చెందిన కాంగ్రెస్‌ పార్టీ బూత్‌ కన్వీనర్లు, మండల, డివిజన్‌ కన్వీనర్లు, పార్టీ మండల అధ్యక్షులు పాల్గొన్నారు. 
 
రాజకీయ లబ్ధి కోసమే భూసర్వే: కుంతియా
రాజకీయ లబ్ధికోసమే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం భూ రికార్డుల ప్రక్షాళన పేరిట గ్రామాల్లో గందరగోళానికి తెరలేపుతోందని ఏఐసీసీ కార్యదర్శి, కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి రామచంద్ర కుంతియా ఆరోపించారు. భూసంస్కరణల చట్టాలను తెచ్చి ఎంతోమంది పేదలకు భూములు పంచిన ఘనత కాంగ్రెస్‌ పార్టీదేనని అన్నారు. సీఎం కేసీఆర్‌ ప్రపంచంలోనే మరెక్కడాలేని విధంగా దేశ చరిత్రలో మొదటిసారిగా భూ రికార్డుల ప్రక్షాళనకు పూనుకుంటున్నామని చెప్పడం ప్రజలను మభ్యపెట్టడమేనని అన్నారు. కాంగ్రెస్‌ హయాంలో భూసంస్కరణ చట్టాలను తెచ్చి లక్షలాది రైతు కూలీలకు భూపంపిణీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. 
 
వడ్డీతో సహా బదులు తీర్చుకుంటాం: ఉత్తమ్‌
టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్‌ కార్యకర్తలు, దళిత బడుగు బల హీనవర్గాలపై దాడులు అధికమయ్యాయని, ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. ‘ఖబడ్దార్‌.. కాంగ్రెస్‌ జోలికి వస్తే వడ్డీతో సహా బదులు తీర్చుకుంటాం’ అని హెచ్చరించారు. 2019లో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్సేనన్నారు. ‘మిర్చి పంటకు మద్దతు ధర కోసం ఖమ్మం మార్కెట్‌లో గిరిజన రైతులు ప్రశ్నిస్తే బేడీలు వేస్తారా? నేరెళ్ల దళితులను గొడ్లను బాధినట్లు బాదుతారా? ప్రాజెక్టుల ప్రజాభిప్రాయ సేకరణలో ప్రశ్నిస్తే పెద్దపల్లిలో కాంగ్రెస్‌ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తారా? తస్మాత్‌ జాగ్రత్త’ అంటూ ధ్వజమెత్తారు. 
 
ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టండి: జానారెడ్డి
టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ విధానాలను కాంగ్రెస్‌ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ఎండ గట్టేందుకు సిద్ధం కావాలని సీఎల్పీ నేత జానారెడ్డి పిలుపునిచ్చారు. ఎన్నికల  వాగ్దానాలను అమలు చేయకుండా కొత్త పథకాలతో ప్రజల దృష్టిని మళ్లించేం దుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వ తీరును ఎత్తిచూపాలన్నారు. భూశుద్ధీకరణ పేరిట గ్రామాల్లోకి వస్తున్న రెవెన్యూ యంత్రాంగానికి కాంగ్రెస్‌ కార్యకర్తలు పేద ప్రజల అర్జీలను సేకరించి పరిష్కరించే దిశగా ముందుండాలన్నారు. ప్రజల మధ్య అగాధాన్ని సృష్టించడంతోపాటు గ్రామాల్లో గందర గోళాన్ని నెలకొల్పేం దుకే రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన పేరిట సీఎం అధికార యంత్రాంగాన్ని పుర మాయిస్తున్నాడని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ భట్టివిక్రమార్క ఆరోపించారు.
Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు