2017లో టేకాఫ్... 2016లో ల్యాండింగ్!!

3 Jan, 2017 12:50 IST|Sakshi
2017లో టేకాఫ్... 2016లో ల్యాండింగ్!!

యునైటెడ్ ఎయిర్ లైన్స్ ప్రయాణికులు న్యూ ఇయర్ రోజు వినూత్న అనుభూతిని పొందారు. తాము ప్రయాణించిన విమానం 2017లో బయలుదేరి చేరుకోవాల్సిన ప్రదేశాన్ని 2016లో చేరింది. ఇక వారి అనందానికి అవధులు లేవని చెప్పవచ్చు. న్యూ ఇయర్ రోజు అది చేద్దాం.. ఇప్పటి నుంచి ఇలా ఉందాం అని కొందరు అనుకుంటున్నారు. మరికొందరు మాత్రం ఆ రోజు తమకు ఎదురైన మంచి అనుభూతిని ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. కొత్త ఏడాది బయలుదేరి పాత ఏడాదిలో అడుగుపెట్టడం విమాన ప్రయాణికులలో ఉత్సాహాన్ని నింపింది. ఈ విమాన జర్నీకి సంబంధించి ఫొటో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. ఆ వివరాల ప్రకారం.. యునైటెడ్ ఎయిర్ లైన్స్ విమానం యూఏ890 (బోయింగ్ 787-909) విమానం 2017 జనవరి 1వ తేదీన వేకువజామున చైనాలోని షాంఘైలో బయలుదేరింది. ఆ బోయింగ్ విమానం 2016 డిసెంబర్ 31న రాత్రి అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోకు చేరుకుంది.

ఇది ఎలా సాధ్యమంటే.. ఈ రెండు ప్రాంతాల మధ్య టైమ్ వ్యత్యాసం దాదాపు 16 గంటలు. శాంఘై నుంచి శాన్ ఫ్రాన్సిస్కో వెళ్లడానికి దాదాపు 11 గంటల 5 నిమిషాలు పడుతుంది. టైమ్ వ్యత్యాసం గమనించినట్లయితే ఇది సాధ్యపడుతుందని చెప్పవచ్చు. ఎలా అంటే ఉదాహరణకు షాంఘైలో 2017 జనవరి 1న టైమ్ మధ్యాహ్నం 12 గంటలు అనుకుంటే.. సరిగ్గా అదే సమయంలో శాన్ ఫ్రాన్సిస్కోలో టైమ్ 2016 డిసెంబర్ 31 రాత్రి 8 గంటలు ఉంటుంది. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ ఫొటో ప్రస్తుతం వైరల్‌గా మారి విపరీతంగా షేర్ అవుతోంది. ఏ సమయానికి షాంఘై నుంచి బయలుదేరి శాన్ ఫ్రాన్సిస్కో చేరుకుందన్న వివరాలు ఆ పోస్ట్ లో పేర్కొనలేదు.

మరిన్ని వార్తలు