‘భారత్‌ అభివృద్ధి చెందిన దేశమే’

12 Feb, 2020 09:17 IST|Sakshi

న్యూయార్క్‌ : భారత్‌ను అభివృద్ధి చెందుతున్న దేశంగా పరిగణించరాదని, భారత ఆర్థిక వ్యవస్థను డెవలప్డ్‌ ఎకానమీగా నిర్ధారించినట్టు అమెరికన్‌ ట్రేడ్‌ రిప్రజెంటేటివ్స్‌ (యూఎస్‌టీఆర్‌) కార్యాలయం స్పష్టం చేసింది. అభివృద్ధి చెందుతున్న దేశాలకు అమెరికా అందించే ప్రయోజనాలకు భారత్‌కు అర్హత లేదని తేల్చిచెప్పింది. దీంతో ఇప్పటివరకూ అమెరికా జనరలైజ్డ్‌ సిస్టం ఆఫ్‌ ప్రిఫరెన్సెస్‌ (జీఎస్పీ) పథకం కింద అందే ప్రయోజనాలకు కోత పడింది. ఈ స్కీమ్‌ కింద భారత ఎగుమతిదారులు ఎలాంటి సుంకాలు చెల్లించకుండా అమెరికాకు ఎగుమతులు చేసుకునే సౌకర్యం ఉంది. ఈ ప్రయోజనాలు రద్దయితే భారత ఎగుమతిదారులకు ఇబ్బందులు ఎదురవనున్నాయి.

దేశ తలసరి ఆదాయం, ప్రపంచ వాణిజ్యంలో  దేశ వాటా ఆధారంగా ఆ దేశ ఎకానమీని మదింపు చేస్తారు. ఇక ప్రపంచ వాణిజ్యంలో 0.5 శాతం ఉన్న దేశాలను అభివృద్ధి చెందుతున్న దేశాలుగా పరిగణిస్తారు. భారత్‌ ఈ పరిమితిని ఎప్పుడో అధిగమించింది. 2017 నాటికే భారత్‌ ప్రపంచ వాణిజ్యంలో ఎగుమతుల్లో 2.1 శాతం, దిగుమతుల్లో 2.6 శాతం సమకూరుస్తోంది. దీంతో పాటు అర్జెంటీనా, బ్రెజిల్‌, ఇండోనేషియా, దక్షిణాఫ్రికా వంటి దేశాల సరసన జీ 20లో భారత్‌ కొనసాగుతుండటంతో భారత్‌ను అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగానే పరిగణించాలని యూఎస్‌టీఆర్‌ స్పష్టం చేసింది.

భారత్‌-అమెరికా వాణిజ్య చర్చల్లో ఈ అంశం కూడా ప్రధానంగా చర్చకు రానుంది. మరోవైపు ఇతర దేశాలు అందించే జీఎస్‌పీ వంటి అభివృద్ధి రాయితీలు, సాయం తమకు అవసరం లేదని, భారత్‌ స్వతంత్రంగానే వాణిజ్యంలో దీటుగా ఎదుగుతుందని వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్‌ గోయల్‌ స్పష్టం చేశారు. ఇక జీఎస్‌పీ ప్రయోజనాలకు గండిపడితే భారత్‌ ఎగుమతులపై ఒత్తిడి పెరుగుతుందని, మార్కెట్‌ వాటా తగ్గుతుందని ట్రేడర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

చదవండి : యూఎస్‌ కాంగ్రెస్‌ బరిలో మంగ అనంతత్ములా

మరిన్ని వార్తలు