ఆ కార్లతో గర్భస్థ శిశు మరణాలు

3 Mar, 2017 17:17 IST|Sakshi
ఆ కార్లతో గర్భస్థ శిశు మరణాలు

బోస్టన్‌(యూఎస్‌ఏ):
వోక్స్‌వ్యాగన్‌ కార్ల నుంచి విడుదలయ్యే హానికారక పొగ కారణంగా యూరప్‌, అమెరికాలో గర్భస్థ శిశు మరణాలు సంభవించినట్లు ఓ అధ్యయనంలో తేలింది. అంతేకాదు, ఆ కార్లు వెదజల్లిన కాలుష్యం బారిన పడినవారిలో ఒక్కో వ్యక్తి ఆయుర్ధాయం సగటున పదేళ్లు పడిపోయినట్లు ఆ అధ్యయనం వివరించింది. వివిధ దేశాల పరిశోధకులతోపాటు యూఎస్‌లోని మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ నిపుణులు చేపట్టిన అధ్యయనంపై ‘ఎన్విరాన్‌మెంట్‌ రీసెర్చ్‌ లెటర్స్‌’ జర్నల్‌లో ప్రచురితమైన వివరాలివీ..

2008-15 మధ్య కాలంలో జర్మనీకి చెందిన వోక్స్‌వ్యాగన్‌ కంపెనీ 11 మిలియన్ల డీజిల్‌ కార్లను ప్రపంచవ్యాప్తంగా మార్కెట్‌లోకి విడుదల చేసింది. ప్రమాణాల మేరకే వాటిని తయారు చేసినట్లు సంస్థ అప్పట్లో ప్రకటించింది. అయితే, కార్ల నమూనాపై పలు సందేహాలు రావటంతో నిపుణులు పరిశీలించారు. ఆ పరిశీలనలో వోక్స్‌వ్యాగన్‌ కార్లు ఈయూ ప్రమాణాలు నిర్దేశించిన వాటికంటే నాలుగు రెట్లు ఎక్కువ నైట్రిక్స్‌ ఆక్సైడ్లు, ఇతర కాలుష్యాలను వాతావరణంలోకి వెదజల్లినట్లు తేలింది.

దీనిపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తటంతో అమెరికా, యూరోప్‌లలో ఉన్న కార్లను వోక్స్‌వ్యాగన్‌ సంస్థ వెనక్కి తీసేసుకుంది. అయితే, అప్పటికే ఆ కార్లు పర్యావరణంతోపాటు జనంపై చెడు ప్రభావం చేయగలిగినంతా చేశాయని అధ్యయనాల్లో తేలింది. ఈ కార్ల కాలుష్య ప్రభావంతో యూరప్‌లో సుమారు 1,200 గర్భస్థ శిశు మరణాలు సంభవించినట్టు వెల్లడయింది. యూఎస్‌ఏలో 60, జర్మనీలో 500 వరకు గర్భస్థ శిశు మరణాలు సంభవించినట్లు గుర్తించారు. జర్మనీ పొరుగు దేశాలైన పోలండ్‌, ఫ్రాన్స్‌, చెక్‌ రిపబ్లిక్‌ దేశాల్లో సంభవించిన గర్భస్థ శిశు మరణాల్లో 60 శాతం వరకు 2008-15 కాలంలో తయారైన ఈ కార్ల కాలుష్యం ఫలితమేనని తేల్చారు. వెనక్కి తీసేసుకున్న కార్లకు తిరిగి వోక్స్‌వ్యాగన్‌ కాలుష్య కారకాలను తగ్గించే పరికరాలను అమర్చి 2017 చివరికల్లా మార్కెట్‌లోకి తీసుకువస్తే మరో 2,600 వరకు గర్భస్థ శిశుమరణాలను తగ్గించే అవకాశం ఉంటుందని అంచనా వేసింది. ఈయూ దేశాల్లో ప్రజలు అనారోగ్య సమస్యలపై వెచ్చించే 4.1బిలియన్‌ యూరోలను ఆదా చేసినట‍్లవుతుందని వెల్లడించింది.

>
మరిన్ని వార్తలు