Vijay Kiragandur On Salaar Movie: సలార్‌ అందరి అంచనాలు అందుకుంటుంది

21 Dec, 2023 05:45 IST|Sakshi

 – నిర్మాత విజయ్‌ కిరగందూర్‌

‘‘ప్రభాస్‌ సూపర్‌ స్టార్‌. ప్రశాంత్‌ నీల్‌ పెద్ద డైరెక్టర్‌. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే ఎలా ఉంటుందో అని అభిమానులు, ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ వర్గాలు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ‘కేజీఎఫ్‌’ తర్వాత ప్రశాంత్‌ నీల్‌ ఎలాంటి కథ చెబుతున్నారు? ప్రభాస్‌ను ఎలా చూపించబోతున్నారు? అంటూ అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వారందరి అంచనాలను  ‘సలార్‌’ అందుకుంటుంది’’ అని నిర్మాత విజయ్‌ కిరగందూర్‌ అన్నారు. ప్రభాస్, శ్రుతీహాసన్‌ జంటగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘సలార్‌’. హోంబలే ఫిలింస్‌పై విజయ్‌ కిరగందూర్‌ నిర్మించిన ‘సలార్‌’ మూవీ తొలి భాగం ‘సలార్‌: సీజ్‌ఫైర్‌’ ఈ నెల 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా విజయ్‌ కిరగందూర్‌ మాట్లాడుతూ...

► ‘సలార్‌’ ని 2021లో ్ప్రారంభించాం. కోవిడ్‌ కారణంగా 2022లో పూర్తి స్థాయి షూటింగ్‌ ్ప్రారంభించి, 2023 జనవరిలో షూటింగ్‌ను పూర్తి చేశాం. ఐదు భాషల్లో(తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం, హిందీ) సినిమాను విడుదల చేయాలనుకోవడంతో చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. పోస్ట్‌ప్రొడక్షన్‌కి కూడా సమయం పట్టింది. మా హోంబలే ఫిలింస్‌ తొలిసారి తెలుగులో హీరో ప్రభాస్‌గారితో పనిచేశాం. ప్రభాస్‌గారు చాలా మంచి వ్యక్తి. అందువల్లే ఈ ప్రయాణం మాకు మధురమైన అనుభూతినిచ్చింది. 
► ‘సలార్‌: సీజ్‌ఫైర్‌’ 90 శాతం షూటింగ్‌ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చిత్రీకరించాం. ఈ సినిమా కోసం ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించాం.. మేకింగ్‌ పరంగా ఎక్కడా రాజీపడలేదు. ‘కేజీఎఫ్‌’తో కన్నడతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, హిందీ ప్రేక్షకుల్లోనూ మాకు మంచి గుర్తింపు దక్కింది. మా పై వాళ్లు చూపించిన ప్రేమాభిమానాలు, నమ్మకం మాలో మరింత బాధ్యతను పెంచాయి. అందువల్ల వాళ్లకి నచ్చేలా మంచి సినిమాలు చేయాలని ముందుకు వెళుతున్నాం.
► మన సంస్కృతి, సంప్రదాయాలు, భాషలు వేర్వేరుగా ఉంటాయి. అయితే అన్నీ కలిస్తేనే ఇండియన్‌ సినీ ఇండస్ట్రీ అవుతుంది. భారతీయ చిత్ర పరిశ్రమను గ్లోబల్‌ రేంజ్‌కి తీసుకెళ్లాలనేదే నా అభి్ప్రాయం. అంతే తప్ప ఇది తెలుగు, ఇది కన్నడ సినిమా అని ఆలోచించటం లేదు. నిర్మాతగా పదేళ్లు పూర్తయ్యాయి. ఒక్కో సినిమా ఒక్కో అనుభవాన్ని నేర్పించింది. ప్రశాంత్‌ నీల్‌ప్రొడక్షన్, మార్కెటింగ్‌లలో కల్పించుకోడు. మా మధ్య మంచి అనుబంధం, అవగాహన  ఉంది. ‘సలార్‌’ లో రెండు భాగాలుగా చేసేంత కథ ఉంది.. అందుకే రెండు భాగాలుగా తీస్తున్నాం. 
► నాకు కథ, డైరెక్టర్‌ ముఖ్యం. బడ్జెట్‌కి ఎక్కువ ్ప్రాధాన్యత ఇవ్వను. అవసరం మేరకు ఎంతైనా ఖర్చు పెడతాను. తెలుగు ఇండస్ట్రీ వాళ్లు బాగా రిసీవ్‌ చేసుకున్నారు. తెలుగు ప్రేక్షకుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వాళ్లు సినిమాను ఆదరిస్తున్న తీరే అందుకు ఉదాహరణ. ఓ వైపు ప్రభాస్‌గారు, మరోవైపు ప్రశాంత్‌ నీల్‌ గారు బిజీగా ఉండటంతో ‘సలార్‌’ మూవీ నుంచి గ్రాండ్‌ ఈవెంట్‌ చేయలేదు. సినిమా రిలీజ్‌ తర్వాత సక్సెస్‌ ఈవెంట్‌ను కండెక్ట్‌ చేస్తాం.

>
మరిన్ని వార్తలు