చదువును బట్టి పెరిగే ఆయుర్దాయం

16 Oct, 2017 04:26 IST|Sakshi

రోజుకో సిగరెట్‌ ప్యాక్‌తో ఏడేళ్ల జీవితకాలం హరీ

జన్యువులపై ఎడిన్‌బర్గ్‌ వర్సిటీ తాజా పరిశీలనలో వెల్లడి

సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌: ఓ వ్యక్తి చదువుకు ఆయుష్షుకు లంకె ఉంటుందా? ఎన్ని సంవత్సరాలు ఎక్కువగా చదువుకుంటే అన్నేళ్లు వారి ఆయుష్షు కూడా పెరుగుతుందా? బరువు పెరిగితే జీవిత కాలం తగ్గుతుందా? ఈ ప్రశ్నలకు పరిశోధకులు అవుననే సమాధానం చెబుతున్నారు. పాఠశాల విద్య అనంతరం ఎన్నేళ్ల పాటు చదువును కొనసాగిస్తారో అన్ని రోజులు ఆయుష్షు పెరిగే అవకాశాలు ఉన్నాయని స్కాట్లాండ్‌ యూనివర్సిటీ ఆఫ్‌ ఎడిన్‌బర్గ్‌ అషర్‌ ఇన్‌స్టిట్యూట్‌ వారు తేల్చారు. ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా, ఐరోపాల్లో 6 లక్షల కంటే ఎక్కువ మందికి సంబంధించిన జన్యువుల సమాచారాన్ని సేకరించి వారు ఈ పరిశోధనలు చేశారు. ఎక్కువ చదవడం వల్ల ఆయుష్షును  పెంచుకోవచ్చని పరిశోధకులంటున్నారు.

ఊబకాయం..ఆయుష్షుకు ముప్పు
ఊబకాయుల బరువుపైనే వారి ఆయుష్షు ఆధారపడి ఉంటుందనీ, 1980లతో పోల్చితే ఒబెసిటీ సమస్య మూడు రెట్లు ఎక్కువైందని పరిశోధనల్లో తేలింది. సాధారణం కంటే అధిక బరువున్న వారికి...అదనంగా ఉన్న ఒక్కో కేజీకి రెండు నెలల చొప్పున ఆయుక్షీణత ప్రమాదం ఉండొచ్చని పరిశోధకులు చెబుతున్నారు. జీవనశైలి, ఆరోగ్య పరిస్థితి, వ్యాధులు వంటి వాటిపై జన్యువులు పోషించేపాత్రపై ఈ పరిశీలనను నిర్వహించారు. అధ్యయనంలో పాల్గొన్నవారి జన్యు సమాచారాన్ని పరిశోధకులు విశ్లేషించారు. మనుషుల జన్యువుల్లో సగం వరకు తల్లిదండ్రులతో ముడిపడి ఉంటాయి.

ఆయుర్దాయంపై వివిధ రకాల జన్యువులు చూపే ప్రభావాన్ని వారు అంచనా వేశారు. జీవనశైలిని చాలా వరకు ఈ జన్యువులే ప్రభావితం చేస్తున్నాయని కనుగొన్న పరిశోధకులు...మద్యసేవనం, ఇతర దురలవాట్ల ప్రభావం ఆయుష్షుపై ఏ మేరకు పడుతుందనే దానిపై అధ్యయనం సాగించారు. ‘ఏయే రకాల ప్రవర్తనలు, అలవాట్లు, రోగాలు ఆయుష్షు పెరగడానికి, తరగడానికి కారణమవుతున్నాయనేది విశ్లేషించడానికి పెద్దమొత్తంలో అందుబాటులోకి వచ్చిన వివిధ రకాల జన్యువుల సమాచారం ఉపయోగపడింది’ అని ఉషర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ప్రొఫెసర్‌ జిమ్‌ విల్సన్‌ చెబుతున్నారు. ‘ఆయుష్షుపై జీవనశైలి చూపే ప్రభావంపై మా అధ్యయనం దృష్టిని కేంద్రీకరించింది’ అని డాక్టర్‌ పీటర్‌ జోషి పేర్కొన్నారు.

అధ్యయనంలో తేలినవి


► ప్రతిరోజు ఒక సిగరెట్‌ ప్యాకెట్‌ కాల్చేవారి జీవితకాలం మొత్తంగా ఏడేళ్లపాటు తగ్గిపోతుంది. అయితే ఇప్పటినుంచైనా సిగరెట్‌ కాల్చడం మానేసేవారు ప్రమాదాన్ని తప్పించుకుని, అసలు పొగతాగని వారితో సమానంగా జీవించవచ్చు.
► అధిక బరువున్న వారు ఒక కిలో బరువును తగ్గించుకుంటే జీవితకాలాన్ని రెండు నెలలు పొడిగించుకోవచ్చు.
► స్కూలు చదువు తర్వాత ఎన్ని ఎక్కువ సంవత్సరాలు చదువుకుంటే అన్ని ఎక్కువ ఏళ్లు జీవిస్తారు.
► శరీరంలో అధిక కొవ్వుతో పాటు, చక్కెరవ్యాధితో ముడిపడిన ఆయా అంశాలు జీవితకాలంపై దుష్ప్రభావం చూపుతాయి.  
► రక్తంలో అధిక కొలెస్ట్రాల్‌కు కారణమయ్యే జన్యువు కారణంగా ఎనిమిది నెలల మేర ఆయుష్షు తగ్గిపోతుంది. 

>
మరిన్ని వార్తలు