రెడ్ బ్యాక్... యమ డేంజర్!

12 Apr, 2016 18:06 IST|Sakshi
రెడ్ బ్యాక్... యమ డేంజర్!

విష జంతువులు, పురుగులతో జర జాగ్రత్తగానే ఉండాలన్న విషయం మరోసారి రుజువైంది. చూసేందుకు సూక్ష్మంగా కనిపించినా వాటిలో విషం మహ పవర్ ఫుల్ గా ఉండే అవకాశాలు ఉంటాయన్నది మళ్ళీ తెలిసింది.  చిన్న సాలీడు కుట్టినా ప్రాణం పోతుందన్నది ఇప్పుడు ఆస్ట్రేలియా తూర్పు ప్రాంతంలో జరిగిన ఘటనతో వెలుగులోకి వచ్చింది. 'రెడ్ బ్యాక్' స్పైడర్ కుట్టి ఓ యువకుడు చనిపోవడం అక్కడి జనాన్ని ఆందోళనకు గురి చేస్తోంది.

ఆస్ట్రేలియాలో సిడ్నీకు చెందిన జాయ్ డెన్ బర్లైగ్ అనే 22 ఏళ్ళ యువకుడు న్యూ సౌత్ వేల్స్ ప్రాంతంలోని నార్త్ కోస్ట్ ప్రాంతంలో వాకింగ్ చేస్తుండగా 'రెడ్ బ్యాక్' సాలీడు కుట్టి చనిపోవడం అక్కడి జనాన్ని భయకంపితుల్ని చేసింది. గతవారం జాయ్ డెన్ ఎడమ మోచేతిని సాలీడు కుట్టడంతో విషం అతని గ్రంధులకు చేరిపోయింది. నాలుగు రోజులపాటు యాంటీబయోటిక్స్ తో  వైద్యం అందించిన డాక్టర్లు గురువారం ఆస్పత్రినుంచి డిశ్చార్జి చేశారు. ఒకరోజు బాగానే ఉన్న అతడు ఆదివారం చనిపోయాడు. అయితే జాయ్ కు నంబోర్ ఆస్పత్రి వైద్యులు విషానికి విరుగుడుగా మందు అందించారో లేదో అన్న అనుమానం అతడి తల్లిదండ్రులు వ్యక్తం చేస్తున్నారు. యాంటీ వీనమ్ అభివృద్ధి పరిచిన అనంతరం 1955 తర్వాత రెడ్ బ్యాక్ కుట్టడంతో మనుషులు చనిపోయినట్లు రికార్డుల్లో మాత్రం ఎక్కడా లేనట్లు తెలుస్తోంది.

జాయ్ మరణం తమకు తీరని విషాదంగా మారిందని, తమ కొడుకు ప్రాణాన్ని సాలీడు రూపంలో మింగేస్తుందని ఊహించలేదని జాయ్ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఏడాది క్రితం చిన్నకొడుకు లచ్లాన్ కారు ప్రమాదంలో చనిపోయాడు. తీవ్ర గాయాలతో బయటపడ్డ జాయ్ ఇప్పుడిప్పుడే కోలుకోగా...  వారం క్రితం సాలీడు కుట్టడంతో వచ్చిన ఇన్ఫెక్షన్ తో నాలుగు రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొంది, తీరా ఇంటికి వచ్చిన రెండు రోజులకు ప్రాణం పోవడం ఆ తల్లిదండ్రులు నమ్మలేకపోతున్నారు. తమ కుమారుడికి  వైద్యులు సరైన విషం విరుగుడు మందు ఇచ్చారో లేదో అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జాయ్ డెన్ ప్రకృతి ప్రేమికుడని, పర్వతాలు ఎక్కడం, సముద్రాల్లో డైవింగ్, అడవుల అన్వేషణ వంటి సాహసోపేతమైన ప్రయత్నాలు చేసేవాడని మరెవ్వరికీ ఇటువంటి నష్టం జరగకుండా విష పురుగులతో ప్రమాదాలను నివారించే ప్రయత్నాలు మరింత జరగాలని కోరుతున్నారు.   

వైవిధ్యభరితమైన సాలె పురుగులకు ఆస్ట్రేలియా ప్రసిద్ధి. అయితే వాటిలో చాలా జాతులు మనుషులకు కొద్దిపాటి ముప్పు తెచ్చిపెట్టేవే అయినా ప్రాణాంతకం మాత్రం కావు. అయితే బ్లాక్ విడో జాతికి చెందిన రెడ్ బ్యాక్ మాత్రం దేశంలోని పెద్ద నగరాలతో సహా అన్ని ప్రాంతాల్లోనూ కనిపిస్తూనే ఉంటుంది. ఆస్ట్రేలియాలోని రెండు డేంజరస్ సాలె పురుగుల్లో ఇది ఒకటిగా చెప్పొచ్చు. ఆ ఖండంలోనే కాక ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన సాలెపురుగు మాత్రం ఫన్నల్-వెబ్. ఈ ఫన్నల్ వెబ్ కుట్టడం కారణంగా 1980 తర్వాత ఎవరూ చనిపోయినట్లుగా రికార్డులు లేవని ఆస్ట్రేలియా మ్యూజియం ఆధారాలను బట్టి తెలుస్తోంది. అయితే సంవత్సరానికి కనీసం 2 వేల మంది దాకా రెడ్ బ్యాక్ కాటుకు గురౌతూనే ఉంటారని, ఈ సాలె పురుగు కుట్టినప్పుడు తీవ్రమైన మంట, నొప్పి, నరాల బలహీనత, వాంతులు వంటి బాధలు కలుగుతాయని చెప్తున్నారు. కాగా ముఖ్యంగా ఆడ పురుగులు కుట్టినప్పుడు అవి వాటి చొంగను వదులుతాయని దాంతో కొంత ప్రమాదమేనని చెప్తున్నారు.

మరిన్ని వార్తలు