జింబాబ్వేపై కరువు దరువు

8 Feb, 2016 10:37 IST|Sakshi

హరారే: జింబాబ్వేలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయి. దీని ప్రభావం కారణంగా 16,500 పశువులు మృతిచెందాయి. అనేక గ్రామీణ ప్రాంతాల్లో కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో జింబాబ్వే అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే విపత్తు పరిస్థితిని ప్రకటించారు. 26 శాతం జనాభాకు ఆహార పదార్థాలు దొరకని పరిస్థితులు నెలకొన్నాయి. దక్షిణాఫ్రికా, జింబాబ్వేలపై ఎల్‌నినో తీవ్ర దుష్ర్పభావం చూపింది. ఒకనాడు దక్షిణాఫ్రికాకు ధాన్యాగారంగా పేరొందిన జింబాబ్వేలోనూ ఇదే దుస్థితి నెలకొంది. ఎల్‌నినో ప్రభావం కారణంగా నీళ్లు లేక ఆనకట్టలకు పగుళ్లు ఏర్పడ్డాయి. పంటలు ఎండిపోయాయి. కాగా శాశ్వత కరువు పరిస్థితుల ఛాయల నేపథ్యంలో కొన్ని సంవత్సరాలుగా దక్షిణాఫ్రికా పొరుగు దేశాలనుంచి ఆహార పదార్థాలను దిగుమతి చేసుకుంటోంది. తాజా సమాచారం ప్రకారం 15 లక్షల మందికి ఆహార పదార్థాలు దొరకడం లేదు. 60 జిల్లాల్లో తీవ్ర కరువు పరిస్థితులు కొనసాగుతున్నాయని ప్రజాపనుల శాఖ మంత్రి సేవియర్ కసుకువరే పేర్కొన్నారు.

పర్యావరణంలో మార్పుల ప్రభావం కారణంగా వర్షాలు సరిగా కురవలేదని, అందువల్లనే కరువు పరిస్థితులు తలెత్తాయని రాబర్ట్ ముగాబే పేర్కొన్నారు. కరువు ప్రభావాన్ని తగ్గించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆయన అభయమిచ్చారు.

మరిన్ని వార్తలు