అంతా గప్‌చుప్‌..!

5 Feb, 2018 12:41 IST|Sakshi
మార్క్‌ఫెడ్‌లో అమ్మకానికి సిద్ధంగా ఉన్న కందులు

వ్యవసాయ మార్కెట్‌లో ప్రైవేట్‌గా కందుల కొనుగోళ్లు

గుట్టుచప్పుడు కాకుండా మార్క్‌ఫెడ్‌కు తరలింపు

మార్కెటింగ్‌ అధికారుల ఆధీనంలో శ్రీనివాస్‌ ట్రేడర్స్‌ సరుకు

జనగామ: జనగామ మార్క్‌ఫెడ్‌ కేంద్రంగా కందుల అక్రమ వ్యాపారానికి అడ్డుకట్టవేయలేక పోతున్నారు. ప్రైవేట్‌ కొనుగోళ్లపై నిఘా వేయాల్సిన మార్క్‌ఫెడ్‌ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాత్రి 8 గంటలు దాటిన తర్వాత కూడా కందులను తూకం వేస్తూ రాచమార్గాన గోదాముల్లోకి తరలిస్తున్నారు. పెద్ద మొత్తంలో ప్రభుత్వ ఖజానాకు కన్నం పెడుతున్నా చూసీచూడనట్లు వ్యవహరించడం వెనుక మతలబు ఏంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. జనగామ వ్యవసాయ మార్కెట్‌లో ప్రైవేట్‌గా కందులను కొనుగోలు చేస్తూ, మద్దతు ధరకు విక్రయిస్తూ అడ్డంగా దొరికిపోయిన విషయం తెలిసిందే. 

జేసీ హెచ్చరికలు బేఖాతర్‌..
ప్రైవేట్‌గా కందుల కొనుగోలు కోసం వ్యాపారులు జనగామ మార్క్‌ఫెడ్‌ కేంద్రాన్ని అడ్డా చేసుకున్నారు. జనగామ, బచ్చన్నపేట, దేవరుప్పుల, స్టేషన్‌ఘన్‌పూర్, లింగాలఘణపురం, పాలకుర్తి మండలాలతోపాటు సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన మోత్కూరు, ఆలేరు, తిరుమలగిరి తదితర ప్రాంతాల నుంచి దళారులు పెద్ద ఎత్తున కందులను ఇక్కడకు తరలిస్తున్నారు. కందుల అక్రమ దందాపై ‘సాక్షి’ అనేక వార్తా కథనాలను ప్రముఖంగా ప్రచురించడంతో మంత్రి హరీష్‌రావుతోపాటు మార్కెటింగ్‌ శాఖ ఉన్నతాధికారులు స్పందించిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో వారు మాట్లాడిన ప్రతిసారి జనగామ పేరును ప్రస్తావించారు. కందుల అమ్మకాల్లో గోల్‌మాల్‌ చేసిన అధికారులతోపాటు విక్రయించిన వారిపై క్రిమినల్‌ చర్యలు తప్పవని హెచ్చ రించారు. అయితే మంత్రి ఆదేశాలతో వారం రోజుల క్రితం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ వనజాదేవి మార్క్‌ఫెడ్‌ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. బినామీ కందులను విక్రయిస్తుంటే పట్టుకున్నారు. అప్పటి వరకు మార్క్‌ఫెడ్‌ అధికారులు గుర్తించక పోవడం సిగ్గుచేటు. జేసీ హెచ్చరికలను సైతం బేఖాతరు చేస్తూ రైతుల పేరుతో కొంతమంది వ్యాపారులు, బ్రోకర్లు కందుల అమ్మకాలను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు.

శ్రీనివాస ట్రేడర్స్‌ కందుల సంగతి తేలేది నేడే
జనగామ మార్కెటింగ్‌ శాఖ అధికారుల ఆధీనంలో ఉన్న శ్రీనివాస ట్రేడర్స్‌ కందుల సంగతి సోమవారం తేలనుంది. కొద్ది రోజుల క్రితం మార్కెట్‌ ఆవరణలో శ్రీనివాస ట్రేడర్స్‌కు చెందిన కందులను తూకం వేస్తుండగా మార్కెటింగ్‌ డీఎం ఎన్‌.సంతోష్, సివిల్‌ సప్లయ్, రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. ప్రైవేట్‌గా ఎక్స్‌పోర్టు చేసే క్రమంలో ట్రేడర్లు 60 కిలోలు, ప్రభుత్వరంగ సంస్థలు మాత్రం 51 కిలోలు తూకం వేస్తున్నాయి. శ్రీనివాస టేడర్స్‌కు సంబంధించిన గోదాంలో 51 కిలోల 180 బస్తాలను కాంటా వేస్తుండడంతో అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. కందులకు సంబంధించి సదరు వ్యాపారి రికార్డులను చూపించగా..విచారణ సోమవారానికి వాయిదా వేశారు. అధికారులు తనిఖీలు చేస్తున్న సందర్భంగా ట్రేడర్లతోపాటు కొంతమంది అడ్తి వ్యాపారులు అక్కడికి చేరుకున్నారు. ఇరువురి మధ్య మాటామాటా పెరిగి వాగ్వాదం చోటు చేసుకుంది. నిజంగా అక్రమ కందులే మార్క్‌ఫెడ్‌కు తరలించేందుకే 51 కిలోల కాంటా వేస్తున్నారు. ఖాళీ గన్నీ బ్యాగులను కూడా అక్కడి నుంచే తీసుకువచ్చారంటూ అధికారుల ముందే ఆరోపణలు చేశారు. ప్రతిరోజు కందుల అక్రమ వ్యాపారం జోరుగా సాగుతున్నా పట్టించుకోవడం లేదంటూ సదరు అడ్తి వ్యాపారి బహిరంగంగా విమర్శించినా ఎవరూ కూడా అడ్డుచెప్పకపోవడం అనుమానాలకు తావిస్తోంది. 

కందుల విక్రయాలపై విచారణ ఎక్కడ?
మార్క్‌ఫెడ్‌లో జనవరి 2 నుంచి కొనుగోలు చేసిన కందులపై విచారణ పక్కదారి పట్టింది. కందులు అమ్మకాలు చేసిన అసలు రైతులు.. బినామీదారులు ఎంతమంది అనే విషయాన్ని తెలుసుకునేందు జేసీ పదిహేను రోజుల క్రితమే ఆదేశాలు జారీ చేశారు. జేసీ ఆదేశాలను సైతం మార్క్‌ఫెడ్‌ అధికారులు లెక్కచేయడం లేదనే ప్రచారం జరుగుతుంది. వీఆర్వో ధ్రువీకరణ పత్రాలు జారీ చేసే క్రమంలో నిబంధనలు ఏ మేరకు పాటిస్తున్నారనే సందేహాలు కలుగక మానదు. విషయమై మార్కెట్‌ డీఎం ఎన్‌.సంతోష్‌ మాట్లాడుతూ శ్రీనివాస ట్రేడర్స్‌కు చెందిన కందులకు సంబంధించి సోమవారం విచారణ చేస్తామన్నారు. మార్కెట్‌లో కందుల అమ్మకాలపై గట్టి నిఘా వేస్తున్నమని పేర్కొన్నారు.

సీసీ కెమెరాలు ఎందుకు బిగించడం లేదు
వ్యవసాయ మార్కెట్‌లో అక్రమ వ్యాపారాన్ని అరికట్టేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని గతంలోనే సర్కారు ఆదేశాలు జారీ చేసింది. జనగామ మార్కెట్‌లో మాత్రం సీసీ కెమరాల ఏర్పాటు విషయంలో జాప్యం ఎందుకు చేస్తున్నారనే విషయమై చర్చ జరుగుతోంది. సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తే మార్క్‌ఫెడ్‌కు కందులు ఎవరెవరుతీసుకు వస్తున్నారనే వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది 

మరిన్ని వార్తలు