‘పంచాయతీ’ ప్రతిష్టాత్మకం!

18 Jan, 2018 07:36 IST|Sakshi

అధికార పార్టీ నేతలకు సవాల్‌గా ఎన్నికలు

గత ఎన్నికల ఫలితాలపై సీఎం కేసీఆర్‌ విశ్లేషణ

ఎమ్మెల్యేల భుజాలపై ‘పంచాయతీ’  బాధ్యతలు

బలం నిరూపించుకునేందుకు బరిగీసిన కేసీఆర్‌

స్థానిక గెలుపోటములపైనా ఎమ్మెల్యేల గ్రేడింగ్‌

ప్రతికూలంగా మారితే పరేషాన్‌ తప్పదు మరి..!!

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: సాధారణ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో వస్తున్న గ్రామపంచాయతీ ఎన్నికలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీంతో అధికార పార్టీ ఎమ్మెల్యేలకు పంచాయతీ ఎన్నికలు సవాలుగా మారాయి. ఈ పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితమే అయినప్పటికీ శాసనసభ్యుల గెలుపోటములను ముందే నిర్ణయించేలా పకడ్బందీగా జరగనుండడంతో ఎమ్మెల్యేలకు సంకటంగా మారనున్నాయి. 2013లో జరిగిన ఎన్నికలు అప్పటి అ«ధికార కాంగ్రెస్‌ పార్టీకి ప్రతికూలంగా జరిగాయనే చెప్పొచ్చు. ఉమ్మడి రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ పార్టీ కాంగ్రెస్‌తో పోటీపడి నువ్వానేనా అన్నట్లు పోరాడింది. చివరకు మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుని అప్పటి పరిస్థితులకు తగ్గట్టుగా తెలంగాణ ఆవశ్యకతను చాటిచెప్పింది. గత పంచాయతీ ఎన్నికలు జిల్లాలోని అప్పటి మెజారిటీ ఎమ్మెల్యేలకు ఇబ్బందులనే తెచ్చి పెట్టాయి. జిల్లాలో 13 శాసనసభ నియోజకవర్గాలు ఉంటే కేవలం ముగ్గురు మాత్రమే పంచాయతీ ఎన్నికల్లో తమ ఆధిక్యాన్ని నిలుపుకోగలిగారు. పేరుకు పార్టీ రహితమే అయినా గ్రామపంచాయతీ ఎన్నికలు పూర్తిగా రాజకీయ పార్టీల నాయకులే బరిలో దిగారు. అన్ని నియోజకవర్గాల్లోనూ ఎమ్మెల్యేలు, రాజకీయ పార్టీల నియోజకవర్గ స్థాయి నేతలు ప్రచారం నిర్వహించారు. వచ్చే నెలలోనే గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉంటాయని స్వయంగా సీఎం కేసీఆర్‌ ప్రకటించడం, స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు ప్రజాప్రతినిధులు పనితీరుకు గ్రేడింగ్‌గా పేర్కొనడం అధికార పార్టీ నేతల్లో చర్చనీయాంశంగా మారింది.

2013లో టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల పోటాపోటీ.. 2014 నుంచి తారుమారైన ఫలితాల సంఖ్య..
గత పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌ పార్టీ కంటే టీఆర్‌ఎస్‌ స్వల్ప మెజారిటీ సాధించింది. అయితే.. తదనంతర పరిణామాలు ఫలితాల సంఖ్యను తారుమారు చేశారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం, టీఆర్‌ఎస్‌ అధికార పగ్గాలు చేపట్టడంతో అప్పటివరకు వివిధ పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సర్పంచులు అధికార టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో టీఆర్‌ఎస్‌ బలం అమాంతం పెరిగింది. పూర్వ కరీంనగర్‌ జిల్లాల్లో 1,207 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగితే 379 గ్రామాల్లో టీఆర్‌ఎస్, 372 పంచాయతీల్లో కాంగ్రెస్‌ పార్టీ మద్దతుదారులు గెలుపొందారు. 137 టీడీపీ, 37 బీజేపీ, 30 వైఎస్‌ఆర్‌సీపీ మద్దతుదారులు సర్పంచులుగా ఎన్నికయ్యారు. అదేవిధంగా 17 చోట్ల సీపీఐ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందగా, 235 పంచాయతీల్లో స్వతంత్ర అభ్యర్థులుగా విజయం సాధించారు. అయితే.. 2014లో టీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ‘గ్రామాలు అభివృద్ధి బాటన నడవాలంటే అధికార పార్టీ పంచెన చేరడమే మేలని’ భావించిన చాలా మంది సర్పంచులు ప్లేట్‌ ఫిరాయించారు. మూడింట రెండు వంతుల గ్రామాల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ జెండా ఎగురవేసింది. జిల్లాలో ఇద్దరు మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్, చీఫ్‌విప్‌ కొప్పుల ఈ«శ్వర్‌ ప్రాతినిధ్యం వహిస్తుండడం, సీఎం కేసీఆర్‌ జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో నేతల్లో, ప్రజల్లో రాజకీయ చైతన్యం కూడా పెరిగింది. అయితే.. గత ఎన్నికల ఫలితాలపై సీఎం కేసీఆర్‌ విశ్లేషణ జరిపి ప్రస్తుతం తీసుకోవాల్సిన కార్యాచరణ రూపొందించి పంచాయతీకి కదులుతున్నట్లు తెలుస్తోంది.

‘పంచాయతీ’ల బాధ్యత ఎమ్మెల్యేలపైనే.. ఎమ్మెల్యేలకు సంకటంగా ‘పంచాయతీ’..
శాసనసభ ఎన్నికలకు ముందు వస్తున్న పం చాయతీ ఎన్నికలు అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేలకు సవాలుగా మారనున్నాయి. ఒక్క జగిత్యాల మినహాయిస్తే 12 నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌కి చెందిన ఎమ్మెల్యేలే ఉన్నా రు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అధిష్టానం ఎమ్మెల్యే పనితీరుపై గ్రేడిం గ్‌ విధానాన్ని అమలు చేస్తోంది. సర్వేల ఆధారంగా పనితీరును అంచనా వేస్తూ గ్రేడింగ్‌లు ఇస్తోంది. దీని ఆధారంగానే ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఇస్తారనే ప్రచారం సైతం ఉండడంతో ఎమ్మెల్యేల్లో ఆందోళన కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేలకు పంచాయతీ ఎన్నికల గుబులు మొదలైంది. ఈ ఎన్నికల్లో సర్పంచులను గెలిపించుకునే బాధ్యతను ఎమ్మెల్యేల భుజాలకెత్తిన సీఎం కేసీఆర్, బలం నిరూపించుకునేందుకు బరిగీసినట్లు కనిపిస్తోంది. మెజారిటీ సర్పంచులను గెలిపిం చుకున్న వారికే ఎమ్మెల్యే టికెట్లు వస్తాయని పార్టీ పెద్దల నుంచి మౌఖిక ఆదేశాలు వచ్చి నట్లు తెలుస్తోంది.

పంచాయతీ ఎన్నికలను పరోక్ష పద్ధతిలో నిర్వహించేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోం ది. దీంతో ఎమ్మెల్యేలకు ఎన్నికల ఖర్చు తడిసిమోపెడు అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాగా.. ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్, ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కె.తారకరామారావు, చీఫ్‌విప్‌ కొప్పుల ఈశ్వర్, ఆర్టీసీ చైర్మన్‌ సోమారపు సత్యనారాయణ, సాంస్కృతిక సారథి చైర్మన్‌ రసమయి బాలకిషన్‌తోపాటు ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, దాసరి మనో హర్‌రెడ్డి, బొడిగె శోభ, పుట్ట మధు, వొడితెల సతీష్‌బాబు, కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, చెన్నమనేని రమేశ్‌బాబు ప్రాతినిధ్యం వహిస్తు న్న హుజూరాబాద్, సిరిసిల్ల, ధర్మపురి, రామగుండం, మానకొండూర్, కరీంనగర్, పెద్దపల్లి, చొప్పదండి, మంథని, హుస్నాబాద్, కోరుట్ల, వేములవాడ నియోజకవర్గాల్లో ఇప్పటికే మెజారిటీ గ్రామాల్లో అధికార పార్టీకి చెందిన సర్పంచులే ఉన్నారు. అయితే.. రాబోయే ఎన్నికల్లో సైతం ఎక్కువ స్థానాలు గెలిపించుకోవాలని అధినేత కేసీఆర్‌ సీరియస్‌గా ఆదేశించడం.. ఆ ఎన్నికలు, ఖర్చు సంకటంగా మారనుందన్న చర్చ మొదలైంది.

మరిన్ని వార్తలు