కష్టాల కడలిలో చేనేత

27 Jan, 2018 12:49 IST|Sakshi

చేయూతనివ్వని సొసైటీలు

సమస్యలతో సహజీవనం

కార్మికుల జీవనం ఛిద్రం

ఆదుకోని సర్కారు

కర్నూలు, కోవెలకుంట్ల: చేనేతల సంక్షేమంపై సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంలో కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతున్నారు. వంశపారంపర్యంగా నమ్ముకున్న వృత్తి నట్టేట ముంచడంతో వ్యవసాయ పనులు చేయలేక, ఇతర ఉపాధి అవకాశాలు లేకపోవడంతో వారి జీవనం ఆగమ్యగోచరంగా మారింది. ఆదుకోవాల్సిన సొసైటీలు చూయూతనివ్వడం లేదు. కోవెలకుంట్ల, సంజామల, అవుకు మండలాల్లో సుమారు వెయ్యి కుటుంబాలు చేనేత వృత్తి నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. కోవెలకుంట్ల డివిజన్‌లోని బిజనవేముల, వెలగటూరు, సంజామల, నొస్సం, ముక్కమల్ల, కానాల,  సంగపట్నం, కాశీపురం  గ్రామాల్లో  చేనేతలు నూలు, పట్టు చీరెలు, ఖద్దరు వస్త్రాలు నేయడం ద్వారా వచ్చే కూలితో కుటుంబాలను పోషించుకుంటున్నారు. 

బతుకులు చిద్రం..
ఏళ్ల తరబడి వృత్తినే నమ్ముకుని కాలం వెల్లదీస్తున్నారు. సొసైటీల ద్వారా వస్త్రాలు, చీరెలు నేసేందుకు కావాల్సిన దారం, మెటీరియల్‌ సరఫరా చేయడంతో పాటు స్వతహాగా ఉపాధి పొందేందుకు రుణాలు అందజేయాల్సి ఉండగా సొసైటీలు నిర్వీర్యమవడంతో వారి బతుకులు దయనీయంగా మారాయి. కడప జిల్లా జమ్మలమడుగు, ఎమ్మిగనూరు, ప్రొద్దుటూరు పట్టణాలకు చెందిన వ్యాపారులు పట్టు, నూలు చీరెలు, ఖద్దరు వస్త్రాలు నేసేందుకు కావలసిన రేషం, జరీ, దారం, నూలు, రంగులు, తదితర మెటీరియల్‌ను సరఫరా చేస్తుండగా ఆయా గ్రామాలకు చెందిన చేనేతలు వస్త్రాలు నేసి వ్యాపారులకు అందజేస్తుండగా వారిచ్చే కూలితో జీవనం సాగిస్తున్నారు.

ఆదాయం అంతంతే..
వస్త్రాలు నేయడం ద్వారా వచ్చే కూలి అంతంత మాత్రంగానే ఉండగా వీటిని నేసేందుకు ఎక్కువ సమయం పడుతోందని చేనేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాధారణ మగ్గం ద్వారా పట్టుచీర తయారు చేసేందుకు 3 రోజులు, నూలు చీర, ఏడు మీటర్ల ఖద్దరు వస్త్రం నేసేందుకు ఒక రోజు సమయం పడుతుంది. అలాగే విద్యుత్‌ మగ్గాల ద్వారా పట్టుచీరకు ఆరుగంటలు, నూలు చీరకు 4 గంటల సమయం పడుతుందని వారు  చెబుతున్నారు. మూడు రోజులు కష్టపడి చీర నేస్తే రూ.300, మీటరు ఖద్దరుకు రూ.14 కూలి ఇస్తున్నారని  వాపోతున్నారు. నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలు పెరిగిపోవడంతో వచ్చే కూలితో  కుటుంబాన్ని పోషించడం కష్టమారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూట గడవటమే కష్టంగా మారటంతో  కొన్ని కుటుంబాలు వృత్తికి స్వస్తి చెప్పి ఇతర పనులు చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. మిగిలిన కుటుంబాలు   వృత్తిని వదలుకోలేక, ఇతర పనులు చేయలేకపోతున్నారు. ప్రభుత్వం నుంచి సాయం అందకపోవడంతో వారి జీవనం కష్టంగా మారింది. ఇప్పటికైనా ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు